తెలంగాణ మంత్రి బీసీ నాయకురాలు కొండా సురేఖ వ్యవహారం.. మరింత తీవ్రంగా పరిణమిస్తోంది. ఆమె కు పార్టీ వైపు నుంచి లక్ష్మణ రేఖలు స్పష్టంగా గీశారు. పార్టీ అధిష్టానం నుంచే నేరుగా ఆమెకు ఫోన్ రావ డం.. మీడియా ముందుకు రావద్దని.. మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వొద్దని ఆదేశించడం ఇప్పుడు చర్చకు దారితీసింది. తాజాగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్.. మీనాక్షి నటరాజన్ కూడా సురేఖకు ఇదే ఆదేశం ఇచ్చారు. మీడియా కు ఎలాంటి సమాచారం ఇవ్వొద్దని ఆదేశించారు.
ఈ పరిణామాలతో సురేఖ ఫ్యామిలీ ఇప్పుడు డోలాయమానంలో పడింది. ఇక, ఈ కుటుంబం గత ఆరేడు మాసాలుగా పార్టీపైనా.. ప్రబుత్వంపైనా తీవ్ర అసంతృప్తితో ఉంది. తమ సొంత జిల్లా ఉమ్మడి వరంగల్‌లో తమకు రాజకీయంగా బద్ధశత్రులుగా ఉన్న కడియం శ్రీహరి సహా అనేక మందిని పార్టీలోకి తీసుకోవడాన్ని సురేఖ ఫ్యామిలీ వ్యతిరేకిస్తోంది. ఇది.. అసలు మొత్తం వివాదానికి కేంద్రం. ఇక, ఆ తర్వాత సురేఖ భర్త మురళి.. వివాదాస్పద వ్యాఖ్యలు.. జిల్లాలో తాను తప్ప.. ఎ వరూ రాజకీయాలు చేయలేరని చెప్పడం వంటివి దుమారాన్ని పెద్దది చేశాయి.
ఈ క్రమంలోనే అధిష్టానం ఆయనను క్రమశిక్షణ సంఘం ముందుకు పిలవడం.. పలుమార్లు వివరణ ఇవ్వడం తెలిసిందే. అయితే.. ఇదేసమయంలో కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(మునుగోడు ఎమ్మెల్యే) పలు మార్లు నాయకులను ప్రభుత్వాన్ని తిట్టిపోసినా.. ఆయనను ఇప్పటి వరకువిచారించ లేదన్న బాధ కూడా సురేఖ కుటుంబంలో ఉంది. మరోవైపు.. ప్రభుత్వంలో అవినీతి పెరుగుతోందన్న వాదనను కూడా ఆమె వెల్లడించారు. ఆ తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు.. తన శాఖలో జోక్యం చేసుకోవడం. కూడా సురేఖను ఇబ్బంది పెట్టింది.
ఇలా.. మొత్తంగా సురేఖ కుటుంబం తీవ్ర అసంతృప్తితో ఉన్న నేపథ్యంలోనే ఆమె ఇంటికి వరగల్ పోలీసులు మఫ్టీలో రావడం.. ఆమె ఓఎస్డీ ని అరెస్టుచేసేందుకు ప్రయత్నించడం.. అర్ధరాత్రి హైడ్రామా.. ఇలా.. ఒకదాని వెంట ఒకటి చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాలతో ఇక, తాడోపేడో తేల్చుకునేందుకు సురేఖ రెడీ అయ్యారు. అయితే.. ఆమెను నిలువరిస్తూ.. మీడియా ముందుకురావద్దంటూ పార్టీ అధిష్టానం లక్ష్మణ రేఖలు గీయడం గమనార్హం. ఈ క్రమంలో సురేఖ ఏం చేస్తారు? అనేది ప్రశ్న. అయితే.. ప్రస్తుతానికి ఆమెకు మరో దారి లేనందున.. సర్దుకుపోతారో.. లేక సీఎం దగ్గర తేల్చుకుంటారో చూడాలి.