తన సొంత పార్టీ కాంగ్రెస్ పై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సొంత పార్టీయే తనను దారుణంగా మోసం చేసిందని షాకింగ్ కామెంట్లు చేశారు. కాంగ్రెస్ పార్టీని కాపాడేందుకు తన సొంత ఆస్తులు అమ్ముకున్నానని, అయినా పార్టీ తనను మోసం చేసిందని సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పారని విమర్శించారు.
ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కాంగ్రెస్ పెద్దపీట వేస్తోందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టారని దుయ్యబట్టారు. బీజేపీ నుంచి వచ్చిన వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి, ఆయన కుమారుడికి ఎంపీ టికెట్ ఇచ్చారని విమర్శించారు. పార్టీ కోసం కష్టపడిన తనను మాత్రం పక్కన పెట్టడం దారుణమని వాపోయారు. ఇఖ, కాంగ్రెస్‌లోని కొందరు నాయకులే తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని కూడా ఆరోపించారు. పార్టీ కోసం ఎంతో త్యాగం చేసిన తనకు అన్యాయం జరిగిందని అసంతృప్తి వ్యక్తం చేశారు.