విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. అమెరికా వెలుపల ఇదే గూగుల్ పెట్టబోతున్న అతి భారీ పెట్టుబడి, భారీ ప్రాజెక్ట్ కావడం విశేషం. ఈ క్రమంలోనే ఏపీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ప్రఖ్యాత ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ పత్రికలో విశాఖ నగరాన్ని, గూగుల్ ప్రాజెక్టును ప్రస్తావించారు. ఆ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. టెక్నాలజీ పెట్టుబడులకు విశాఖ గ్లోబల్ హబ్‌గా మారుతోందనేందుకు ఇదే నిదర్శనమని తెలిపారు.
అంతర్జాతీయ ప్రచురణ సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్‌లో విశాఖ పేరు, గూగుల్ డేటా హబ్ వివరాలు చూడటం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు. టెక్నాలజీ పెట్టుబడుల విషయంలో విశాఖ నగరం ప్రపంచ పటంలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంటోందని, ఇంతకంటే సంతోషం ఏముంటుందని చెప్పారు. #