విశాఖలో గూగుల్ ఏర్పాటు చేయబోతున్న ఏఐ డేటా సెంటర్ ప్రపంచ టెక్ రంగాన్ని ఆకర్షించింది. రాబోయే ఐదేళ్లలో విశాఖలో సుమారు రూ. 1.25 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. భారత్ కు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు దక్కడంపై ప్రపంచ దేశాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఏఐ చరిత్రలో ఇదో మలుపు అని ప్రపంచ ఆర్థిక దిగ్గజాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచ ప్రఖ్యాత వాల్ స్ట్రీట్ జర్నల్ కూడా విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ పై ప్రత్యేక కథనం వెలువరించింది.19వ శతాబ్దపు రైల్వే బూమ్‌ను మించిన పెట్టుబడి ఇదని అభివర్ణించింది.
అంతేకాదు, ఆధునిక విద్యుత్, ఫైబర్-ఆప్టిక్ గ్రిడ్ల అభివృద్ధి వంటి అతిపెద్ద మౌలిక సదుపాయాల బూమ్‌లను కూడా మించిపోయిందని ది వాల్ స్ట్రీట్ జర్నల్ వ్యాఖ్యానించింది. అమెరికా వెలుపల గూగుల్ యొక్క అతిపెద్ద ఏఐ హబ్‌గా విశాఖ నిలవనుందని పేర్కొంది. 1 గిగావాట్ సామర్థ్యం ఉన్న ఈ ఏఐ డేటా సెంటర్ భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఏఐ మరియు క్లౌడ్ సేవల డిమాండ్‌ను తీర్చడంలో కీలకంగా మారనుంది. ఈ ప్రాజెక్టులో అంతర్జాతీయ సబ్‌సీ గేట్‌వే నిర్మాణం కూడా ఉంది.
దీని ద్వారా అంతర్జాతీయ సబ్‌సీ కేబుల్స్ నేరుగా విశాఖపట్నం తీరంలో ల్యాండింగ్ అవుతాయి. తద్వారా విశాఖను గ్లోబల్ డిజిటల్ నెట్‌వర్క్‌లో కీలక కేంద్రంగా మారుస్తుందని కూడా వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. 2027 నాటికి అమెరికాలోని సౌత్ కరోలినాలో డేటా సెంటర్ క్యాంపస్ విస్తరణ కోసం గూగుల్ $9 బిలియన్లు కేటాయించింది. ఈ ఏడాది బెల్జియంలో $4 బిలియన్లు, యూకేలో €6 బిలియన్లు గూగుల్ కేటాయించింది. వీటితో పోలిస్తే విశాఖలో పెట్టుబడి చాలా ఎక్కువ.