ఈ సోషల్ మీడియా జమానాలో అసలు వ్యాఖ్యలు ఆర్డినరీ బస్సులా ప్రయాణించే సరికి ఫేక్ కామెంట్లు సూపర్ లగ్జరీ బస్ మాదిరి నెట్టింట శరవేగంగా ప్రయాణిస్తున్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యలను వక్రీకరించడం, అవే అసలు కామెంట్లని తప్పుడు ప్రచారం చేయడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలోనే మంత్రి నారాయణ చేసిన కామెంట్లను వక్రీకరరించి సోషల్ మీడిాయలో ప్రచారం చేస్తున్నారు.
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వర్మను ఉద్దేశించి మంత్రి నారాయణ విమర్శలు చేశారని ప్రచారం జరుగుతోంది. పిఠాపురంలో వర్మను జీరో చేశామని నారాయణ అన్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆ కామెంట్లపై నారాయణ క్లారిటీనిచ్చారు. తన మాటలను వక్రీకరించారని అన్నారు. పిఠాపురంలో సమస్యలు జీరో చేశామని తాను వ్యాఖ్యానించానని, అయితే, వర్మను జీరో చేశామని తాను మాట్లాడినట్లు తన వ్యాఖ్యలను వక్రీకరించారని నారాయణ చెప్పారు. ఇలా తప్పుడు ప్రచారం చేయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు.
తన వ్యాఖ్యలను వక్రీకరించడం దురుద్దేశపూరితమని, ఎన్డీఏలో ఎలాంటి విభేదాలు లేవని, అన్ని పార్టీలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని చెప్పారు. పిఠాపురం నియోజకవర్గంలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని వర్మ అన్నారు. పేటీఎం బ్యాచ్ చేసే ప్రచారాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. విశాఖలో వర్మతో కలిసి నారాయణ పర్యటించారు.