శ్రీకాకుళం జిల్లా.. పలాస నియోజకవర్గం కాశీబుగ్గలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఉదయం జరిగిన తొక్కిసలా టలో 9 మంది భక్తులు మృతి చెందారు. వీరిలో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన హైదరాబాద్ నుంచి తరలి వచ్చిన మంత్రి నారా లోకేష్.. బాధిత కుటుంబాలను పరామర్శించారు. వారికి భరోసా కల్పించారు. వారి ఆవేదనను తన ఆవేదనగా భావిస్తానని చెప్పారు. అనంతరం.. మంత్రి లోకేష్ ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించి ఇక్కడ చికిత్స పొందుతున్న 16 మంది వద్దకు వెళ్లి పరిశీలించారు. వారితో మాట్లాడి ఓదార్చారు.
అనంతరం.. తిరిగి తొక్కిసలాట ఘటన జరిగిన వెంకటేశ్వరస్వామి వారి ఆలయానికి చేరుకున్నారు. మంత్రులు అచ్చెన్నాయు డు, వంగలపూడి అనిత, ఎమ్మెల్యే గౌతు శిరీష.. కలెక్టర్ సహా జిల్లా అధికారులతో కలిసి ఆలయంలో పరిశీలించారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి.. ఎలా జరిగిందో తెలుసుకున్నారు. అదేసమయంలో ఆలయ ధర్మకర్త.. హరి ముకుంద్ పండాతోనూ ఆయన మాట్లాడారు. ఘటనకు సంబంధించిన వ్యవహారం తనను ఎంతో కలచి వేసిందని.. దూరా భారం నుంచి తిరుమలకు వెళ్లలేని వారికి ఇక్కడే ఉచితంగా శ్రీవారి కైంకర్యాలు వీక్షించేందుకు.. తన తల్లి కోరిక మేరకు ఆలయాన్ని నిర్మించినట్టు పండా మంత్రికి వివరించారు. ఇలా జరుగుతుందని తాను అసలు ఊహించలేదన్నారు.
ఇక, మంత్రి నారా లోకేష్ ఆలయ పరిసర ప్రాంతాల్లో 30 నిమిషాలకు పైగా అధికారులతో సమీక్షించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. జరిగిన ఘటన తీవ్ర విచారకర మని తెలిపారు. అయితే.. 94 ఏళ్ల పండా.. ఒక మంచి ఉద్దేశంతో ఈ ఆలయాన్ని నిర్మించారని.. ఊహించని విధంగా జరిగిన ఘటనతో విషాదం మిగిలిందన్నారు. దీనిపై విచారణ చేయిస్తామన్నారు. ఇదేసమయంలో బాధిత కుటుంబానికి అండగా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇకపై అన్ని ఆలయాల్లోనూ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలు సహా.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి పరిహారం ప్రకటించారు.
ఇదీ.. సాయం!
1) మృతి చెందిన వారి ఒక్కొక్క కుటుంబానికీ రూ.15 లక్షలు.
2) ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారికి రూ.3 లక్షలు
3) అంతేకాదు.. వారు కోలుకునే వరకు ఆసుపత్రిలో ఉచిత చికిత్స అందిస్తారు.