ఒక ప్రమాదం.. కొన్ని కాదు.. చాలా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపేసింది. ఓ ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం, మితిమీరిన వేగం పదుల కుటుంబాలను కకావికలం చేసింది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని ఖానాపూర్ గేటు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏకంగా 21 మంది ప్రాణాలు కోల్పోవడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. చేవెళ్ల నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఆర్టీసీ బస్సును రాంగ్ రూట్‌లో వచ్చిన కంకర లారీ ట్రక్కు బలంగా ఢీకొట్టింది. దీంతో 21 మంది అక్కడికక్కడే చనిపోగా.. మరో 20 మందికిపైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రమాదం ఎలా జరిగింది?
తాండూరు నుంచి చేవెళ్ల మీదుగా హైదరాబాద్‌కు వస్తున్న టీఎస్ 34 టీఏ 6354 నంబరు గల ఆర్టీసీ బస్సు హైదరాబాద్-బీజాపూర్ హైవేపై.. చేవళ్ల వద్ద ఘోర ప్రమాదానికి గురైంది. వన్ వే ఉన్నప్పటికీ.. కంకరలోడు తో మితిమీరిన వేగంతో వచ్చిన ట్రక్కు ఆర్టీసీ బస్సును బలంగా ఢీ కొట్టింది. దీంతో రెండు వాహనాలు దెబ్బతినగా.. కంకరలోడు బస్సులోని ఆర్టీసీ ప్రయాణాకులపై పడింది. దీంతో వారంతా దానికింద కూరుకుపోయి.. ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.
కుటుంబాల్లో చిచ్చు..
రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ బస్సు ప్రమాద ఘటనా స్థలంలో.... ఓ హృదయవిదారక దృశ్యం అందరినీ కలచి వేస్తోంది. 15నెలల పసికందుతో హైదరాబాద్‌లోని ఆసుపత్రికి వస్తున్న ఓ తల్లి ఈ ప్రమాదంలో చనిపోయారు. మృతదేహాలను బస్సులో నుంచి బయటకు తీసి రోడ్డుపై పడుకోబెట్టిన దృశ్యం చూపరులను కంట తడి పెట్టిస్తోంది.
అదేవిధంగా తాండూరుకు చెందిన ఎల్లయ్యగౌడ్ అనే లారీ డ్రైవర్ కుటుంబానికి చెందిన ముగ్గురు బీటెక్ చదువుతున్న కుమార్తెలు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. వీరంతా అక్కాచెల్లెళ్లు. ఆదివారం సెలవు కావడంతో కాలేజీ నుంచి ఇంటికి వెళ్లి సోమవారం.. తిరిగి కాలేజీలో చేరేందుకు బయలు దేరారు. ఈ ఘటనలో వారంతా కన్నుమూశారు. వీరికి త్వరలోనే పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు వారి మాతృమూర్తి గుండెలవిసేలా రోదిస్తూ చెప్పిన విషయాలు అందరినీ శోకసంద్రలో ముంచెత్తాయి. మరో కుటుంబానికి చెందిన ఏకైక కుమార్తె అఖిల రెడ్డి కూడా ఈ ప్రమాదంలో తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయా కుటుంబాలతో తరని చిచ్చు రగిలింది.
మృతి చెందిన వారిలో..
+ 12 మంది మహిళలు
+ 8 మంది పురుషులు
+ ఒక చిన్నారి(తల్లితో సహా మృతి)