పీపీపీ.. పబ్లిక్-ప్రైవేట్-పార్టనర్ షిప్(ప్రభుత్వ-ప్రైవేటు-భాగస్వామ్యం) వ్యవహారం.. ఏపీలో తీవ్ర చర్చకు రచ్చకు దారితీసిన వేళ.. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పీపీపీపై సచంలన వ్యాఖ్యలు చేశారు. ఫ్యూచరంతా ప్రైవేటు భాగస్వామ్యానిదేనని ఆయన తేల్చి చెప్పారు. ప్రైవేటు పెట్టుబడులు దేశానికి అత్యంత కీలకమ ని అన్నారు. దేశ పురోభివృద్ధిలో పీపీపీ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని విడదీసి చూడలేనంతగా పరిస్థితులు మారాయని చెప్పారు.
ముఖ్యంగా.. ఐటీ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించేందుకు వినూత్న కార్యక్రమాలు చేస్తు న్నామన్నారు. తద్వారా ఉపాధి, ఉద్యోగ కల్పనతో పాటు.. దేశాన్ని ఆర్థికంగా కూడా ప్రోత్సహిస్తున్నట్టు వివరించారు. ``పీపీపీ లేదా.. ప్రైవేటు భాగస్వామ్యం.. ఈ రెండు కూడా దేశానికి ఆర్థికంగా ఎంతో ప్రయోజన కరం.. వీటిని విడదీసి చూడలేం. ఉపాధి, ఉద్యోగ కల్పన రంగాల్లో ప్రైవేటు భాగస్వామ్యం మరింత పెరగాల్సి ఉంటుంది.`` అని ప్రధాని మోడీ అన్నారు.
తాజాగా సోమవారం.. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో లక్ష కోట్ల రూపాయల రిసెర్చ్ ప్రైవేటు ఫండ్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. అధిక ప్రభావం చూపే పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రైవేటు రంగం బలంగా మద్దతు ఇస్తోందన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంతో పాటు.. ఇతర రంగాల్లోనూ ప్రైవేట్ పెట్టుబడులను ఎంకరేజ్ చేస్తున్నామన్నారు. తద్వారా ప్రజలకు పారదర్శకమైన.. సేవలు మరింత చేరువ అవుతాయని తెలిపారు.
ఏపీలో వివాదం నేపథ్యంలో..
పీపీపీ విధానంపైఏపీలో తీవ్ర రాజకీయ దుమారం రేగిన విషయం తెలిసిందే. టీడీపీ నేతృత్వంలోని కూట మి ప్రభుత్వం 10 మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అయితే.. దీనిని వైసీపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. పీపీపీకి ఇస్తే.. పేదలకు వైద్యం అందదని వైసీపీ వాదన. అయితే.. సర్కారు మాత్రం పీపీపీకి ఇస్తే.. మరింత పారదర్శక సేవలు చేరువ అవుతాయని చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నేరుగా ఏపీ విషయాన్ని ప్రస్తావించకపోయినా.. ప్రైవేటు రంగంపై కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం.