వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడం అంత ఈజీ కాదా..? డబ్బు ఉన్నవారికే ఆయన అపాయింట్మెంట్ దొరుకుతుందా..? అంటే సోషల్ మీడియాలో ఆ పార్టీ కార్యకర్తల నుంచి అవునన్న సమాధానమే వినిపిస్తోంది. జగన్ అపాయింట్మెంట్ ఇప్పుడొక కాస్ట్లీ టాస్క్ గా మారిపోయింది. జగన్ ను కలవకుండా కొంతమంది అడ్డుకుంటున్నారని.. ఆయన అపాయింట్మెంట్ దొరకడం అత్యంత క్లిష్టంగా మారిందని.. డబ్బులు ఉన్న వారికే అపాయింట్మెంట్ ఇస్తున్నారని.. పరోక్షంగా అపాయింట్మెంట్లు అమ్ముకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. సొంత పార్టీ శ్రేణులే ఈ ఆరోపణలు చేస్తున్నారు.
మేము సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడ్డాం... కానీ ఇప్పుడేమో డబ్బు ఉన్నవాళ్లకే జగన్ అపాయింట్మెంట్ దొరుకుతోంది అంటూ పార్టీ కార్యకర్తలే సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది నేతలు కూడా ఇదే గోడును వ్యక్తం చేయడంతో పరిస్థితి మరింత హాట్‌గా మారింది. సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఈ ఆరోపణలకు మరింత బలాన్నిచ్చాయి. ఆయన స్పష్టంగా “జగన్ చుట్టూ భజనపరులు చేరారు” అని వ్యాఖ్యానించడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
అధినేత అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్న అనేక మంది నేతలకు నిరాశే ఎదురవుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలతోనూ, పార్టీ శ్రేణులతోనూ కలిసిపోవాలి. కానీ అలాంటి పరిస్థితి వైసీపీలో లేదు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అపాయింట్మెంట్ లభించడం కష్టమే అనేది అర్థమయ్యే విషయం. ప్రభుత్వ వ్యవహారాలు, ఫైళ్లు, సమావేశాలు.. అన్నీ చూసుకోవాలి కాబట్టి సమయం తక్కువగా ఉంటుంది.
కానీ ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు. పార్టీని బలోపేతం చేయడానికి ఇది సరైన సమయం. ఈ సమయంలో కూడా నేతలకు అపాయింట్మెంట్ దొరకకపోవడం వైసీపీ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తోంది. ఒకప్పుడు ``జగన్ 2.0లో నేతలకు, కార్యకర్తలకు పూర్తిస్థాయిలో సమయం కేటాయిస్తా`` అని ప్రకటించిన జగన్ – ఇప్పుడు ఆ హామీని అమలు చేయలేకపోతున్నారన్న భావన పార్టీ అంతర్గతంగా పాకుతోంది.