తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ్ ట్రస్ట్ (శ్రీవాణి ట్రస్ట్) నిధులతో దేవాలయాలు, పాత దేవాలయాల పునరుద్ధరణ మరియు దేవాలయాల నిర్వహణ చేస్తోన్న సంగతి తెలిసిందే. మత మార్పిడులు ఎక్కువగా ఉన్న గిరిజన, ఎస్సీ మరియు బిసి ప్రాంతాలలో ముఖ్యంగా మత్స్యకారుల కాలనీలలో దేవాలయాలను నిర్మించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. ప్రతి ఏటా 500 దేవాలయాలను నిర్మించాలన్న ప్రతిపాదన ఉంది.
నూతన ఆలయాల నిర్మాణం, పాత ఆలయాల పునరుద్ధరణకు సంబంధించిన కొందరు అభ్యర్థుల నుంచి, ఆలయాల నుంచి దరఖాస్తులు టీటీడీకి వచ్చాయి. ఆ దరఖాస్తులపై ధర్మ ప్రచారక్ ల ద్వారా ఇండిపెండెంట్ సర్వే జరిపి అర్హులైన వారి జాబితాను టీటీడీకి పంపుతామని ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రాం ప్రసాద్ తెలిపారు. ఆ తర్వాత అర్హులైన వారిని టీటీడీ గుర్తిస్తుందని చెప్పారు.
ఆలయాల నిర్మాణం కోసం దేవాదయ శాఖతో ఏపీబీడబ్ల్యూసీ, హెడీపీటీలతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంటుందని తెలిపారు. ప్రతి ఆలయ నిర్మాణం కోసం రూ.10 లక్షలు ఖర్చవుతాయని, ఆ డబ్బు టీటీడీ ఇస్తుందని చెప్పారు. 15 మంది సభ్యులతో విలేజ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తామి తెలిపారు. ఏపీబీడబ్ల్యూసీ, టీటీడీల పర్యవేక్షణలో ఆ కమిటీ ఆలయ నిర్మాణ పనులు చేపడుతుందని అన్నారు. ఈ ప్రకారం టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు బుచ్చి రాంప్రసాద్ లేఖ రాశారు.