అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం.. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అనే అంచనాలున్నాయి. హాలీవుడ్ స్థాయి కథ తీసుకుని.. అక్కడి నుంచి పెద్ద సంఖ్యలో టెక్నీషియన్లను రప్పించి. ఏకంగా 800 కోట్ల దాకా బడ్జెట్ పెట్టి ఈ సినిమాను నిర్మిస్తోంది సన్ పిక్చర్స్. ఇంత పెద్ద సినిమాకు ఎవరు సంగీతం అందిస్తారా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తుంటే.. ఇప్పుడిప్పుడే తొలి అడుగులు వేస్తున్న, కేవలం 21 ఏళ్ల వయసున్న సాయి అభ్యంకర్‌కు ఆ బాధ్యతలు అప్పగించారని తెలిసినపుడు అందరూ ఆశ్చర్యపోయారు.
పెద్దగా అనుభవం లేని, అంత చిన్న కుర్రాడు ఇంత పెద్ద ప్రాజెక్టుకు మ్యూజిక్‌ను హ్యాండిల్ చేయగలడా అనే సందేహాలు కలిగాయి. కానీ సీనియర్ సింగర్స్ టిప్పు-హరిణిల తనయుడైన సాయి అభ్యంకర్.. అనిరుధ్ రవిచందర్ తరహాలోనే టీనేజీలోనే సంగీతంలో పండిపోయాడన్నది చెన్నై వర్గాల టాక్. ఇటీవల ‘డ్యూడ్’తో అతను తన టాలెంట్ ఏంటో చూపించాడు కూడా.
ఎవరేమన్నా అట్లీ, బన్నీ, నిర్మాతలు.. సాయి అభ్యంకర్ మీద పూర్తి నమ్మకంతోనే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటిదాకా సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న విషయాన్ని టీం అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. బన్నీ మాత్రం ఈ విషయాన్ని చెప్పకనే ఈ విషయాన్ని చెప్పేశాడు. ఈ రోజు సాయి అభ్యంకర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతడిని సోదరుడిగా అభివర్ణిస్తూ బన్నీ విష్ చేశాడు. అంతే కాక వచ్చే ఏడాది అతను వైభవం చూడబోతున్నాడని కామెంట్ చేశాడు.
తద్వారా తమ సినిమా సంగీతంతో సాయి అభ్యంకర్ ఉర్రూతలూగించబోతున్నాడని బన్నీ సంకేతాలు ఇచ్చాడు. దీపికా పదుకొనే, మృణాల్ ఠాకూర్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో బన్నీ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని.. అతను భిన్న అవతారాల్లో కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది చివర్లో లేదా.. 2027 ఆరంభంలో ఈ సినిమా రిలీజయ్యే అవకాశముంది.