తమిళ సినిమాలతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్.. తర్వాత బాలీవుడ్లోనూ బోలెడన్ని చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించారు. ఆపై ‘స్లమ్ డాగ్ మిలియనీర్’తో అంతర్జాతీయ స్థాయిలోనూ సెన్సేషన్ క్రియేట్ చేసి ఆస్కార్ అవార్డు కూడా అందుకున్నారు. రెహమాన్ తెలుగు సినిమాలకు పని చేయడం అరుదు.
నాని, కొమరం పులి, ఏమాయ చేసావె, సాహసం శ్వాసగా సాగిపో లాంటి చిత్రాలకు పని చేసినా అవి తెలుగు దర్శకులు తీసినవి కావు. మెగాస్టార్ సినిమా ‘సైరా’కు ముందు రెహమానే మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపికైనప్పటికీ.. తర్వాత ఆయన ఆ చిత్రం నుంచి తప్పుకున్నారు. ఇక మళ్లీ ఆయన్ని తెలుగు సినిమాల్లో చూడమనే అనుకున్నారంతా. కానీ ‘పెద్ది’ సినిమాకు రెహమాన్‌ను ఒప్పించి అందరినీ ఆశ్చర్యపరిచాడు బుచ్చిబాబు సానా.
అయినా ఫాంలో లేని రెహమాన్.. ఇలాంటి మాస్ సినిమాతో ఏం మెప్పిస్తాడో అన్న సందేహాలు కలిగాయి.
కానీ ‘పెద్ది’ ఫస్ట్ గ్లింప్స్‌కు అదిరిపోయే స్కోర్‌తో షాకిచ్చాడు రెహమాన్. ఇప్పుడు ఈ సినిమా నుంచి ‘చికిరి చికిరి’ అనే పాట రాబోతోంది. ఈ పాట గ్లింప్స్ వీడియోను ఈ రోజు రిలీజ్ చేశారు. ఆ వీడియోలో పాటను కొన్ని సెకన్లే చూపించారు. ఆ సౌండింగ్, రామ్ చరణ్ హుక్ స్టెప్ అదిరిపోయాయి. దాని కంటే ముందు రెహమాన్‌తో బుచ్చిబాబు సంభాషణ చాలా ఆసక్తికరంగా సాగింది.
రెహమాన్‌తో ఇలా ఒక ప్రమోషనల్ వీడియో చేయడం అందరికీ పెద్ద షాక్. సైలెంటుగా తన పని తాను చేసుకోవడమే తప్ప.. ప్రమోషన్లలో పెద్దగా ఇన్వాల్వ్ అవ్వడు రెహమాన్. ఆయన్నుంచి మంచి సంగీతం తీసుకోవడం ఒకెత్తయితే.. ఇలా ప్రమోషన్లలోనూ భాగం చేయడం ఇంకో ఎత్తు. ఇక్కడే బుచ్చిబాబు మార్కులు కొట్టేశాడు. రామ్ చరణ్ సినిమా చివరి సినిమా ‘గేమ్ చేంజర్’ కంటెంట్ పరంగా నిరాశపరచడమే కాక.. ప్రమోషన్లలోనూ బాగా వెనుకబడింది.
సినిమా బాగా ఆలస్యం కావడం.. సరైన ప్రమోషన్లు లేకపోవడం పట్ల మెగా అభిమానుల ఫ్రస్టేషన్ మామూలుగా లేదు. కానీ ‘పెద్ది’కి ఆ లోటు లేకుండా చూసుకుంటున్నాడు బుచ్చి. కంటెంట్ బాగుంటోంది. ప్రమోషన్లకూ ఢోకా లేదు. ఏకంగా రెహమాన్‌నే రంగంలోకి దించి ప్రమోషన్లు చేయించడం మాస్టర్ స్ట్రోక్ అనే చెప్పాలి.