ఒక పార్టీని చూసి.. మరో పార్టీ కొన్ని కొన్ని విషయాలు నేర్చుకోవడం తప్పుకాదు. ఇది గతంలోనూ జరిగింది. అయితే.. అనుసరించే విధానాల్లోనే లోపం కనిపిస్తుంది. ఉదాహరణకు టీడీపీ యువతకు ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించి.. వారికే టికెట్లు ఇచ్చింది. వారిలో చాలా మంది విజయం కూడా దక్కించుకున్నారు. అయితే.. అదేసమయంలో టీడీపీ సీనియర్లను విస్మరించలేదు. ఎక్కడ అవసరమని భావిస్తే.. అక్కడ వారి సూచనలు, సలహాలు తీసుకుంది. దీని వల్ల సమతుల్యం ఏర్పడింది.
ఈ విషయంలో టీడీపీఫార్ములాను పుణికి పుచ్చుకుని.. ఆ పార్టీతో పోటీ పడుతున్నట్టుగా వ్యవహరించిన వైసీపీ కూడా గత ఎన్నికల్లో 36 మంది కొత్త ముఖాలకు చోటు కల్పించింది. వారిలో ఒకరిద్దరు తప్ప.. అంద రూ ఓడిపోయారు. ఇదేసమయంలో సీనియర్లను వైసీపీ గాలికి వదిలేసింది. అప్పటి వరకు ఉన్న ప్రాధా న్యం తగ్గించేసింది. దీంతో వారంతా రెబల్ అయ్యారు. పైకి బాగానే ఉన్నా.. అంతర్గతంగా వైసీపీ ఓటమికి ముఖ్యంగా జగన్ మరోసారి ముఖ్యమంత్రి కాకుండా కూడా వ్యవహరించారన్న వాదన ఉంది.
దీంతో వైసీపీలో నేతల సమతుల్యం తగ్గిపోయింది. ఇది భారీ పరాజయానికి.. గెలుస్తామని భావించిన ని యోజకవర్గాల్లోనూ పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది. ఇక, 2వ విషయం.. పార్టీలో తీసుకునే నిర్ణయాలు. ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు చక్కని విధానాన్ని అనుసరిస్తున్నారు. ముందుగా తాను ఏదైనా నిర్ణయం తీసుకోవాలని అనుకున్నా.. దానిపై సీనియర్లతో చర్చిస్తారు. పార్టీ పొలిట్ బ్యూరోలో చర్చిస్తారు. వారికి తన ఆలోచనను చెబుతారు. సమయం ఇస్తారు.
వారి నుంచి కూడా ఆలోచనలు తీసుకుంటారు. అనంతరం.. సదరు నిర్ణయంపై ప్రకటన చేస్తారు. దీనిలో పొలిట్ బ్యూరో నాయకులు చెప్పిన విషయాలు ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. కానీ, వారికి ప్రాధాన్యం ఇచ్చామన్న సంకేతాలను పంపిస్తారు. వైసీపీ విషయానికి వస్తే.. జగన్ తాను తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అనే మాట చెబుతున్నారు. దీంతో ఇక, తమ మాటకు.. సూచనలను ప్రాధాన్యం లేదన్న వాదన నాయకుల్లో బలపడేలా చేస్తున్నారు. ఏదేమైనా.. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు లేకపోతే.. పార్టీ పరంగా మరిన్ని ఇబ్బందులు రావడం ఖాయమన్న చర్చ కొనసాగుతోంది.