చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టుగా.. వ్యవహరిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాజాగా జరిగిన పలు రాష్ట్రాల గవర్నర్ల ఎన్నికల్లో అధికార పార్టీ రిపబ్లికన్లకు భారీ దెబ్బతగిలింది. కనీసం గెలుపు అంచుల వరకు కూడా ఈ పార్టీ అభ్యర్థులు చేరుకోలేక పోయారు. దీనికి.. ట్రంప్ ఇటీవల కాలంలో తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలే కారణమని చెబుతున్నారు. అంతేకాదు.. ట్రంప్ విదేశాలపై విధిస్తున్న సుంకాలతో స్థానికంగా అన్ని ధరలు పెరిగాయి.
ఇలా.. ట్రంప్ ఏడాది పాలన(ఇంకా పూర్తికాలేదు) పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసిందన్న చర్చసాగుతోంది. అయినా.. ట్రంప్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికా దగ్గర భారీ ఎత్తున ఆయుధాలు ఉన్నాయని చెప్పారు. అంతటితో ఆగకుండా.. ఈ ప్రపంచాన్ని ఏకంగా 150 సార్లు పేల్చేయగల సత్తా.. తమ వద్ద ఉందని తెలిపారు.(కానీ, ఆ ప్రపంచంలోనే అమెరికా ఒక భాగం అన్న సంగతి మరిచిపోయినట్టుగా ఉన్నారు.)
అయినా.. తాను శాంతికి మారుపేరని ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం. అణ్వాయుధాలను విడనాడాల న్నది తన సిద్ధాంతమని చెప్పారు. కానీ, అఫ్ఘాన్‌పై అమెరికానే యుద్ధం చేసిన విషయాన్ని కూడా ఆయన మరిచిపోయారు. ఇక, ఈ క్రమంలోనే రష్యా, చైనాలను తాను కోరుతున్నది ఏంటంటే.. అంటూ.. అవి కూడా ఆయుధాలను విడిచిపెట్టాలని సూచించారు. అణు నిరాయుధీకరణను నిలువరించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. దీనికి తాను నడుం బిగిస్తానని చెప్పుకొచ్చారు. కానీ, తమ వద్ద మాత్రం అణ్వాయుధాలను ఉంచుకుంటామని వెల్లడించడం కొసమెరుపు.
మరి ట్రంప్ వ్యాఖ్యలను ఎలా అర్ధం చేసుకోవాలో.. ప్రపంచమే నిర్ణయించుకోవాలి. ఇక, పనిలో పనిగా.. ఆయన భారత్‌ను దువ్వడం ప్రారంభించారు. ఎందుకంటే.. స్వదేశీ వస్తువుల వినియోగం పెరిగిన దరిమిలా.. అమెరికా నుంచి దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. దీంతో అమెరికా పరిశ్రమలు ఇక్కట్లో కూరుకుపోతున్నాయి. దీంతో ఇప్పుడు భారత్ గొప్పదిగా.. ప్రధాని మోడీ మరింతగొప్పవాడిగా ట్రంప్‌కు కనిపిస్తున్న వైనం.. అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయి.