వందేమాతరం.. సుజలాం.. సుఫలాం.. అంటూ నేటికీ ప్రతి రోజూ వినిపించే జాతీయ గేయానికి నేటితో (నవంబరు 7వ తేదీ) 150 ఏళ్లు నిండుతాయి. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని.. దేశవ్యాప్తంగా పండుగ నిర్వహించాలని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 9.50 గంటలకు దేశం యావత్తు.. ఈ గేయాన్ని సామూహికంగా ఆలపించాలని కూడా మోడీ సూచించారు.
వందేమాతరం గేయం.. స్వతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించింది. బ్రిటీష్ పాలకులకు కంటిపై కునుకు లేకుండా చేసిన ఉద్యమ నినాదం కూడా `వందే మాతరం!`. దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 77 సంవత్సరాలు పూర్తయినా.. నేటికీ వందేమాతరం గేయం.. ప్రతి రోజూ అధికారికంగా వినిపిస్తూనే ఉంటుం ది. స్కూళ్లలోనే కాదు.. రేడియో.. జాతీయ అధికారిక మీడియా చానళ్లలోనూ.. ఈ గేయానికి పెద్దపీట వేశారు. నాటి తరమే కాదు.. నేటి తరానికి కూడా ఈ గేయం స్ఫూర్తి దాయకంగా నిలిచింది.
అసలు ఎలా వచ్చింది?
వందేమాతరం గేయాన్ని పశ్చిమ బెంగాల్‌కు చెందిన అప్పటి ప్రముఖ రచయిత బంకిం చంద్ర ఛటర్జీ రచించారు. వాస్తవానికి ఇది గేయం కాదు. ఛటర్జీ రచించిన.. `ఆనందమఠ్` అనే నవలలోని ఓ కవితాత్మక వర్ణన. అంతేకాదు.. ఇది పూర్తిగా సంస్కృతంలో రచించిన నవల. తర్వాత దీనిని బెంగాలీలోకి మార్చారు. ఛటర్జీ దీనిని 1870లో రచించారు. అనంతరం.. తొలిసారి ఇది నవంబరు 7, 1875లో ముద్రణకు నోచుకుంది. ఇక, 75 సంవత్సరాల తర్వాత.. స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో దీనిని తొలిసారి వెలుగులోకి తీసుకువచ్చారు.
అప్పట్లో వందేమాతర గేయం దేశ భక్తికి తార్కాణంగా నిలిచింది. ప్రతి ఒక్కరూ దీనిని ఆలపించేవారు. అంతేకాదు.. బ్రిటీష్ వారిపై జరిగిన అనేక పోరాటాలకు వందేమాతరం స్ఫూర్తిగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే 1950, జనవరి 24న అధికారికంగా దీనిని జాతీయ గేయంగా భారత ప్రభుత్వం గుర్తించింది. అప్పటి నుంచి అన్ని అధికారిక కార్యక్రమాల్లో దీనిని ఆలపిస్తున్నారు. అధికారికంగా దీనిని గుర్తించి 75 ఏళ్లు అయినా.. వాస్తవ రచన ఆధారంగా 150 ఏళ్లు పూర్తి అయిన సందర్భంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా పండుగ నిర్వహించాలని మోడీ సర్కారు నిర్ణయించడం విశేషం.