వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు సీఎం చంద్రబాబు భారీ షాకిచ్చారు. జగన్ హయాంలో తీసుకున్న నిర్ణయాలను.. సమీక్షిస్తున్న చంద్రబాబు ఈ క్రమంలో పలు పథకాలకు పేర్లు మార్చారు. కొన్నింటిని మరింత విస్తృతం చేసి.. వాటిని కూడా మార్పుల దిశగా అడుగులు వేయిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను మారుస్తున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు.
వైసీపీ హయాంలో ఏర్పడిన.. గ్రామ, వార్డు సచివాలయాలను మరింత విస్తరించి.. అధునాతన కార్యాలయా లుగా మార్చాలని నిర్ణయించినట్టు తెలిపారు. గ్రామ, వార్డులలోని ప్రజలకు మరింతగా డిజిటల్ పాలనను చేరువ చేసేందుకు వీలుగా.. మరిన్నిఏర్పాట్లు చేయనున్నారు. ఈ క్రమంలోనే వీటిని ఇక నుంచి `విజన్ యూనిట్లు`గా పిలవనున్నారు. అంటే.. ప్రస్తుతం ఆయా భవనాలపై ఉన్న `గామ/ వార్డు సచివాలయం` అనే పేరును పూర్తిగా తొలగించనున్నారు.
దాని స్థానంలో ``విజన్ యూనిట్` అని రాయనున్నారు. ఈ యూనిట్లు ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించే కేంద్రాలుగా రూపొందనున్నాయి. అంతేకాదు.. చంద్రబాబు కలలు కంటున్న స్వర్ణాంధ్ర విజన్ 2047కు అనుబంధంగా ఇవి పనిచేయనున్నాయి. వీటిలో దాదాపు 90 శాతం ప్రభుత్వ శాఖల పనులు చేరువ అవుతాయి. ఇక.. ఇవి కేవలం పనులు చేయడానికే కాకుండా.. గ్రామీణ వికాసానికి విజనరీ ప్లాన్‌లు రూపొందించే యూనిట్లుగా కూడా పనిచేయాల్సి ఉంటుంది.
కాగా.. రాష్ట్రంలో మొత్తం 13,326 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిని 2019-20 మధ్య అప్పటి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వీటి ద్వారా రెవెన్యూ సహా అనేక సేవలను అందిస్తున్నారు. అయితే.. వైసీపీ ఏర్పాటు చేసినప్పటికీ.. చంద్రబాబు.. వాటిని మరింతగా అబివృద్ధి చేస్తుండడం.. తన విజన్‌కు అనుగుణంగా రూపుదిద్దేలా చేస్తుండడం గమనార్హం.
ఈ వ్యవహారంపై మంత్రి డోలా వీరాంజనేయ స్వామి స్పందించారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్ర మార్పులు తీసుకొస్తున్నారని, ప్రజల కోరిక మేరకే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ పేరు మారుస్తున్నామని అన్నారు. ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన పేరు పెట్టబోతున్నామని తెలిపారు.