శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలలో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రేమ, సేవా స్ఫూర్తిని శ్రీ సత్యసాయి బాబా బోధించారని, లవ్ ఆల్, సర్వ్ ఆల్ అనే సందేశం కోట్లాది మందికి స్ఫూర్తినిస్తోందని మోదీ ప్రశంసించారు. బాబా జీవితం వసుధైవ కుటుంబం విధానానికి నిలువెత్తు నిదర్శనమని అన్నారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి రూ.100 స్మారక నాణెం, ప్రత్యేక తపాలా బిళ్లలను మోదీ ఆవిష్కరించారు.
బాబా భౌతికంగా లేకపోయినా, ఆయన స్థాపించిన సంస్థల సేవలు కొనసాగిస్తున్నాయని మోదీ ప్రశంసించారు. భుజ్ భూకంపం సమయంలో సత్యసాయి సేవాదళం చేసిన సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. శ్రీ సత్యసాయి ట్రస్టు ఆధ్వర్యంలో 100 గిర్ జాతి ఆవులను పేద కుటుంబాలకు మోదీ తన చేతుల మీదుగా అందజేశారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా పేదల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నామని అన్నారు.
వికసిత్ భారత్ లక్ష్యం వైపు భారత్ దూసుకెళ్తోందని, దీనికి ప్రజల భాగస్వామ్యం కీలకమని పిలుపునిచ్చారు. వోకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ అవలంబించి స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని, తద్వారా ఆత్మనిర్భర్ భారత్ కల సాకారమవుతుందని అన్నారు.