శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ప్రేమ, సేవ, ప్రశాంతతలకు బాబా ప్రతిరూపమని చంద్రబాబు కొనియాడారు. లవ్ ఆల్.. సర్వ్ ఆల్.. హెల్ప్ ఎవర్.. హర్ట్ నెవర్ అనేది ఆయన చూపిన దారి అని ప్రశంసించారు. విశ్వశాంతి, విశ్వ సౌభాగ్యం, సకల జనుల సంతోషం అనే భావనతో ఆయన జీవించారని అన్నారు. సూపర్ స్పెషాలిటీ, జనరల్ ఆస్పత్రులు, మొబైల్ ఆస్పత్రుల ద్వారా వేలాదిమంది రోగులకు సేవలందుతున్నాయని గుర్తు చేశారు.
సీమ ప్రజలకు తాగునీరు అందించేందుకు ప్రశాంతి నిలయాన్ని తాకట్టు పెట్టి మరీ ప్రాజెక్టును పూర్తి చేయాలని బాబా అనుకున్నారని గుర్తుచేశారు. కానీ, భక్తులు ముందుకు వచ్చి కోట్లాది రూపాయలు విరాళంగా ఇచ్చారని, రూ.550 కోట్లు ఖర్చుతో ఏపీ, తెలంగాణ, తమిళనాడులో 1600 గ్రామాలు, 30 లక్షలకు పైగా జనాభాకు నీరిచ్చారని గుర్తు చేసుకున్నారు. చెన్నై డ్రింకింగ్ వాటర్ మోడర్నైజేషన్ స్కీంకు రూ.250 కోట్లు ఖర్చు పెట్టారని అన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాలను ఏపీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని చంద్రబాబు అన్నారు.