శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి లోకేశ్ ప్రసంగించారు. పుట్టపర్తికి వచ్చిన ప్రతిసారీ బాబా తనను బంగారూ అని పిలిచినట్లు అనిపిస్తుందని చెప్పారు. మనుషుల్లో ప్రేమ ఉన్నంత వరకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మన మధ్యలోనే ఉంటారని అన్నారు. సత్యసాయి సంస్థలు విలువలతో కూడిన విద్యను అందిస్తున్నాయని కొనియాడారు. విద్యార్థుల్లో సమాజం పట్ల బాధ్యత, విలువలను పెంపొందించే అభ్యాస సంస్థలు ఇవేనని అన్నారు. పేదలకు ప్రేమతో సహాయం అందించాలన్న బాబా మాటలే తనకు స్ఫూర్తి అని తెలిపారు.
బాబా చెప్పినట్లు పిల్లలకు చిన్నప్పటి నుంచే నైతిక విలువలు నేర్పించాలన్నదే తన ధ్యేయం అని అన్నారు. మనుషుల్లో ఆయన దేవుడిని చూశారని, ప్రేమతో ప్రపంచాన్ని గెలిచారని చెప్పారు. సేవతో ప్రజలకు దేవుడయ్యారని, బాబా చూపిన మార్గాన్ని అందరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. కుల, మత, ప్రాంతీయ విభజనలు వద్దని అన్నారు. పేదలకు సాయం చేయాలని, ఎల్లపుడూ సత్యం మాట్లాడాలని చెప్పారు. భగవాన్ శతజయంతి సందర్భంగా మనం ఆయనకు ఇచ్చే ఘన నివాళి ఇదేనని తెలిపారు.