హైదరాబాద్ బిర్యానీ అన్నంతనే అందరికి గుర్తుకు వచ్చే కొన్ని ప్రముఖ రెస్టారెంట్లలో పిస్తా హౌస.. షాగౌస్.. మెహిఫిల్ ముందుంటాయి. మరికొన్ని రెస్టారెంట్ల పేర్లు వినిపించినా.. పైన చెప్పిన మూడు రెస్టారెంట్లకు పలు బ్రాంచ్ లు ఉండటం.. నిత్యం కిటకిటలాడటం లాంటివి జరుగుతుంటాయి. ఈ మూడు రెస్టారెంట్ల యాజమాన్యాల మీద మంగళవారం ఉదయం ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించిన వైనం తెలిసిందే.
ఈ మూడు చైన్ రెస్టారెంట్ల యజమానుల నివాసాల్లోనూ.. వారి మొయిన బ్రాంచ్ లలోనూ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుర్తించిన డాక్యుమెంట్లలో షాకింగ్ నిజాలు వెలుగు చూసినట్లుగా చెబుతున్నారు. అధికారుల్ని ఆశ్చర్యపరిచిన అంశం.. రెస్టారెంట్లలో పని చేసే వారి పేరు మీద పలు ఆస్తులు ఉన్నట్లుగా తెలుస్తోంది. బినామీ పేర్ల మీద ఇన్ని ఆస్తులు ఉండటమా? అంటూ కంగుతిన్న పరిస్థితి.
ఈ రెస్టారెంట్లలో కొన్నింటికి హైదరాబాద్ తో పాటు.. పలు నగరాలతో పాటు విదేశాల్లోనూ ఫ్రాంఛైజీలు ఉన్నాయి. ప్రతి ఏటా వందల కోట్ల రూపాయిల వ్యాపారం చేస్తున్న ఈ సంస్థలు.. హవాలా.. నకిలీ లావాదేవీలు.. అనుమానాస్పద రీతిలో పెద్ద ఎత్తున పన్ను ఎగొట్టినట్లుగా తెలుస్తోంది. ఈ ఆరోపణల నేపథ్యంలో నిర్వహించిన తనిఖీలకు ప్రాధాన్యత వ్యక్తమవుతోంది సోదాల్లో భాగంగా చూపించిన ఆదాయాలకు.. వాస్తవానికి వస్తున్న ఆదాయాలకు పొంతన ఉండటం లేదని.. వీటి మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉందని సమాచారం. పెద్ద ఎత్తున పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్లుగా గుర్తించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడకున్నా.. రోజంతా తనిఖీలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది.