మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా తాజాగా మంగళవారం ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారే డు మిల్లి అడవులలో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందారు. ఆయన వెంట ఉన్న ఆయన భార్య రాజే కూడా హతమ య్యారు. వాస్తవానికి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన హిడ్మా.. బస్తర్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉండేవారు. కానీ, ఇటీవల కాలంలో ఆపరేషన్ కగార్ చేపట్టిన తర్వాత.. భద్రతా దళాల కూంబింగ్ పెరగడంతో నంబాల కేశవరావు సహా అనేక మంది కీలక నాయకులు హతమయ్యారు. దీంతో హిడ్మా తనను తాను రక్షించుకునేందుకు అత్యంతదట్టమైన మారేడుమిల్లికి చేరుకున్నారు.
కానీ, మారేడు మిల్లిలో భద్రతా దళాలు జరిపిన దాడుల్లో హతమయ్యారు. ఇదిలావుంటే.. హిడ్మా విషయంలో అనేక విషయాలు వెలుగు చూస్తున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌కు ఖచ్చితంగా 8 రోజుల ముందు అంటే.. గత మంగళవారం.. ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమం త్రి విజయ్ శర్మ మావోయిస్టుల కంచుకోట అయిన సుక్మా జిల్లాలోని పూవర్తి గ్రామానికి వెళ్లారు. అక్కడే ఉంటున్న హిడ్మా మాతృమూర్తిని కలుసుకున్నారు. ఆమెతో కలిసి భోజనం చేశారు. ప్రస్తుతం పరిస్థితులు ఏమీ బాగోలేదని.. హిడ్మా చిన్నవాడని, చాలా భవిష్యత్తు ఉందని చెప్పారు. ఈ క్రమంలో తల్లిగా.. ఆయనను లొంగిపోయేలా సహకరించాలని కోరారు.
దీనికి ఆమె కూడా అంగీకరించారు. త్వరలోనే తన కుమారుడికి లేఖ రాస్తానని కూడా చెప్పారు. కానీ, మరోవైపు.. కేంద్రం ఆపరేషన్ కగార్‌ను కొనసాగించింది. హిడ్మా కదలికలపైనే కన్నేసింది. ఇటీవల కాలంలో లొంగిపోయిన సీనియర్లను ఉద్దేశించి హిడ్మా అలియాస్ సంతోష్ బహిరంగ లేఖ రాయడం.. వారిని ఉద్యమ ద్రోహులుగా చిత్రీకరించడం తెలిసిందే. ఈ క్రమంలో మరింతగా ఉద్యమంపై చర్చ మొదలైంది. దీనిని ఆధారంగా చేసుకుని భద్రతా బలగాలు హిడ్మా కదలికలను పసిగట్టే ప్రయత్నం చేశాయి. ఛత్తీస్‌గఢ్‌లో ఆయన లేరని నిర్ధారించుకున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ, తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి.
ఇక, మరో కీలక విషయం కేంద్ర హోం మంత్రి అమిత్‌షా.. హిడ్మా విషయంలో డెడ్‌లైన్ పెట్టారు. వాస్తవానికి వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులను లేకుండా చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. అయితే.. అప్పటికే కీలక నేతలు లొంగి పోయిన నేపథ్యంలో హిడ్మాను కూడా లొంగిపోవాలంటూ.. అమిత్‌షా పేరు పెట్టి మరీ పిలుపు నిచ్చారు. `ఈ నెల ఆఖరులోగా లొంగిపోతే మంచిది.`` అని కూడా చెప్పారు. అయితే.. ఈ గడువుకు 12 రోజుల ముందుగానే హిడ్మాను పోలీసులు ఎదురు కాల్పుల్లో మట్టు బెట్టారు.కాగా, హిడ్మా తలపై 50 లక్షల రివార్డు ఉందని అధికారులు తెలిపారు.