ఎనిమిదేళ్లుగా వీడని మర్డర్ మిస్టరీ తాజాగా వీడింది. అమెరికాలో తెలుగు అమ్మాయిని.. ఆమె కొడుకును పాశవికంగా హత్య చేసిన ఉదంతం అప్పట్లో సంచలనంగా మారటమే కాదు.. దీనికి కారణమైన హంతకుడ్ని పట్టుకునేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా ఫలించలేదు. తాజాగా ఆ మర్డర్ మిస్టరీ వీడింది. హంతకుడు వాడిన ల్యాప్ టాప్ అతడ్ని పట్టించింది. ఇంతకూ అసలేం జరిగింది? మర్డర్ మిస్టరీని పోలీసులు ఎలా ఛేదించారు? అన్న వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ కు చెందిన నర్రా హనుమంతరావు అనే వ్యక్తి అమెరికాలోని న్యూజెర్సీలో భార్య శశికళ (40), కొడుకు అనీష్ సాయి (7)తో కలిసి నివసించేవాడు.2017 మార్చి 23న ఆఫీసుకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన హనుమంతరావుకు ఇంట్లో తన భార్య.. కొడుకు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వటంతో కేసు నమోదైంది. దర్యాప్తు చేపట్టారు.
అయితే.. శశికళ.. అనీష్ సాయి హత్యలకు భర్త హనుమంతరావే కారణమని.. అతడికి ఒక కేరళ మహిళకు మధ్య ఉన్న వివాహేతర సంబంధంతోనే భార్యబిడ్డల్ని హత్య చేసినట్లుగా శశికళ బంధువులు ఆరోపించారు. దీంతో.. అతడ్నివిచారించిన పోలీసులు.. తమ దర్యాప్తులో భాగంగా ఘటనాస్థలంలో లభించిన డీఎన్ఏను హనుమంతరావుతో పోల్చగా.. అది సరిపోకపోవటంతో అతడ్ని వదిలిపెట్టారు.
ఎంతకూ ఈ హత్య కేసు ముందుకు సాగని పరిస్థితి. ఈ నేపథ్యంలో హనుమంతరావు అంటే పడనోళ్లు ఎవరైనా ఉన్నారా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అతడికి ఆఫీసులో సహోద్యోగి హమీద్ తో భేదాభిప్రాయాలు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ హత్య కేసుతో హమీద్ కు సంబంధం ఉందా? అన్న కోణంలో తిరిగి దర్యాఫ్తు చేపట్టారు. హత్య జరిగిన ఆర్నెల్ల తర్వాత అతను భారత్ కు వెళ్లినట్లుగా గుర్తించారు.
దీంతో.. భారత్ లో ఉన్న అతడ్ని సంప్రదించిన పోలీసులు హమీద్ డీఎన్ఏ నమూనా ఇవ్వాలని కోరారు. అయితే.. వారి అభ్యర్థనను తిరస్కరిస్తూ వచ్చాడు హమీద్. దీంతో అతడి డీఎన్ఏ ను సేకరించేందుకు హమీద్ కు ఇచ్చిన ల్యాప్ టాప్ ను తమకు పంపాలని కోరుతూ అమెరికా కోర్టు 2024లో కాగ్నిజెంట్ సంస్థకు ఉత్తర్వులు జారీ చేసింది. అతడి ల్యాప్ టాప్ నుంచి సేకరించిన డీఎన్ఏ ఘటనాస్థలంలో ఉన్న డీఎన్ఏతో సరిపోవటంతో హమీద్ ను నిందితుడిగా పేర్కొంటూ అమెరికా పోలీసులు తాజాగా ప్రకటన జారీ చేశారు. అతడి ఫోటోను విడుదల చేసిన పోలీసులు.. అతడి ఆచూకీ తెలిసిన వారు అతడి సమాచారం తెలియజేయాలని కోరారు.