వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత తాజాగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చెల్లి అనే కనికరం కూడా లేదా? అని తన వారి ముందు ఘొల్లుమన్నారు. హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో చోటు చేసుకున్న ఈ పరిణామం చర్చకు దారితీసింది. గురువారం తనపై నమోదైన అక్రమాస్తుల కేసుల విచారణ నిమిత్తం వైసీపీ అధినేత జగన్ నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు వచ్చారు. ఇదేసమయంలో ఆయన చిన్నాన్న కుమార్తె సునీత కూడా అదే కోర్టుకు వచ్చారు.
వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో సీబీఐ విచారణను మరింత లోతుగా చేయాలని అభ్యర్థిస్తూ.. సునీత పిటిషన్ వేశారు. ఈ విచారణ కొనసాగుతోంది. దీనికిగాను సునీత కోర్టు కాంపౌండ్‌లోకి చేరుకున్నారు. ఈ సమయంలోనే జగన్ వచ్చారు. అయితే.. సునీత-జగన్ ఎదురు పడినప్పటికీ జగన్ ఆమెను చూసీ చూడనట్టు వెళ్లిపోయారు. ఈ సమయంలో జగన్‌ను పలకరించేందుకు సునీత ప్రయత్నించింది. అయితే.. ఆమెను ఎవరూ పట్టించుకోలేదు.
దీంతో సునీత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సమీపంలోనే ఉన్న తన కుటుంబ సభ్యుల ముందు ఆవేదన వ్యక్తం చేస్తూ.. చెల్లి అనే కనికరం కూడా లేదా? అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఇక, ఈ కేసు వ్యవహారంతో ఇరుకుటుంబాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. సీఎంగా ఉన్న సమయంలోనే వివేకా హత్య కేసుపై చర్చించేందుకు తాను ప్రయత్నించినా.. జగన్ పట్టించుకోలేదని సునీత చెప్పారు. ఇక, తాజాగా జరిగిన విచారణలో మరింత లోతుగా వివేకా కేసును విచారించాలని ఆమె కోర్టుకు విన్నవించా రు.