ఐబొమ్మ, బొప్పం వెబ్ సైట్లను పోలీసులు పట్టుబట్టి మూసేయించారు. వీటిని నిర్వహించి.. 50 లక్షల మంది డేటాను తన దగ్గర పెట్టుకోవడంతోపాటు 21 వేలసినిమాలకు పైగా పైరసీ చేసి.. సవాల్ రువ్విన ఇమ్మంది రవిని కూడా హైదరాబాద్ సైబర్ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో సినీ ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంది. అయితే.. కథ ఇక్కడితో అయిపోదని.. పైరసీ కేవలం రవితోనే సమసిపోదని సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ హెచ్చరించిన 24 గంటల్లోనే మరో పైరసీ వేదిక వెలుగు చూసింది.
అదే.. `ఐబొమ్మ-1`. ఇది కూడా పైరసీ వెబ్ సైటేనని పోలీసులు చెబుతున్నారు. దీనిలోనూ కొత్త సినిమాలు, ఓటీటీ కంటెంట్ కనిపిస్తుండడం సినీ ఇండస్ట్రీకి మరో గుబులు రేపుతోంది. అంతేకాదు.. ఈ వెబ్ సైట్లో కనిపిస్తున్న సినిమాలపై ఒక్కసారి క్లిక్ చేయగానే.. అది నేరుగా `మూవీ రూల్జ్` అనే మరో పైరసీ సైట్‌కు రీ డైరెక్ట్ అవుతోంది. అంటే.. పైరసీ భూతానికి.. చాలా తలలే ఉన్నాయని తెలుస్తోంది. వాస్తవానికి ఇమ్మంది రవి చెప్పినట్టు.. ఐబొమ్మ సిస్టమ్‌లో మొత్తం 61 మిర్రర్ సైట్లు ఉన్నాయి.
వీటన్నింటినీ పోలీసులు మూయించలేదు. కేవలం ఐబొమ్మ, బొప్పం సైట్లను మాత్రమే మూయించారు. ఈ క్రమంలో వీటికి అనుబంధంగా ఉన్న ఐబొమ్మ -1 ఇప్పుడు హల్చల్ చేస్తోందని పోలీసులు చెబుతున్నా రు. అయితే.. దీనిని కూడా మూయించేందుకుపోలీసులు రెడీ అవుతున్నా.. అది సాధ్యం కాదన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు.. `తమిళ వన్` అనే పైరసీ సైట్‌లోనూ తెలుగు సినిమాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇవన్నీ.. గాడిలోకి తీసుకురావడం ఒక్క రాష్ట్ర పోలీసుల వల్ల సాధ్యమయ్యే పనికాదని తెలుస్తోంది. కాగా, ఐ బొమ్మ రవి కేసును ఫ్రీగా వాదిస్తానని ఓ లాయర్ ముందుకు రావడం విశేషం.