రాష్ట్రపతి, గవర్నర్ల విషయంలో సుప్రీంకోర్టు మరోసారి సంచలన తీర్పు ఇచ్చింది. వారి విధుల విషయం లో జోక్యం చేసుకునేందుకు న్యాయవ్యవస్థకు కొన్ని పరిధులు ఉన్నాయని తెలిపింది. ముఖ్యంగా గవర్నర్లకు ఉన్న విచక్షణాధికారాన్ని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు గుర్తు చేసింది. రాష్ట్ర శాసన సభలు ఆమోదించి పంపించిన బిల్లులను గవర్నర్ ఆమోదించేందుకు మూడు మార్గాలు ఉన్నాయన్న సుప్రీంకోర్టు.. వాటి పరిధిలోనే వారు వ్యవహరించాలని తేల్చి చెప్పింది.
అదేసమయంలో రాష్ట్రపతి విషయంలోనూ సుప్రీంకోర్టు సహా న్యాయవ్యవస్థలు బరులు, గిరులు గీయజాల దని పేర్కొంది. చట్టసభల బిల్లులను నిర్దేశిత సమయంలో ఆమోదించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ విషయంలో గవర్నర్లకు మూడు మాసాల సమయం విధించడం సరికాదన్న సుప్రీంకోర్టు.. వారు కూడా నిర్దేశిత సమయంలోనే బిల్లులను ఆమోదించి పంపాలని సూచించింది. ఒకవేళ సదరు బిల్లులను ఆమోదించకపోతే.. నిర్దేశిత కారణాన్ని చూపాల్సి ఉంటుందని పేర్కొంది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 200.. గవర్నర్లకు విచక్షణాధికారాన్ని ఇస్తున్న విషయం గుర్తు చేసిన సుప్రీంకోర్టు.. ఈ క్రమంలో గవర్నర్లు కూడా ప్రభుత్వాలకు సహకరించాలని సూచించింది. కాగా.. గత మూడు మాసాల కిందట.. సుప్రీంకోర్టు తమిళనాడు గవర్నర్ ఎన్. రవి విషయంలో దాఖలైన పిటిషన్లపై విచారిస్తూ.. గవర్నర్ల వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుబట్టింది. వారేమీ ప్రత్యేక వ్యవస్థ పరిధిలో లేరని.. ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వం కన్నా ఎక్కువ కాదని కూడా వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే మూడు మాసాల్లోగా బిల్లులను ఆమోదించాలని ఆదేశించింది.
అయితే.. ఇలా గవర్నర్, రాష్ట్రపతికి సుప్రీంకోర్టు పరిధులు నిర్ణయించడాన్ని రాష్ట్రపతి ఆక్షేపిస్తూ.. 18 ప్రశ్నలతో కూడిన పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై ఇప్పటి కే రెండు సార్లు విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం.. తాజాగా గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్లకు బిల్లులు ఆమోదించేందుకు మూడు మార్గాలు ఉన్నాయని.. 1) ఆమోదించడం. 2) తిప్పిపంపడం, 3) రాష్ట్రపతికి నివేదించడం. ఈ మూడు మార్గాలను అనుసరించాలని తొక్కిపెట్టి ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడం సరికాదని తేల్చి చెప్పింది.