తెరపై అయినా, తెర బయట అయినా అందరినీ నవ్విస్తూ ఉండే బ్రహ్మానందం.. ఒక ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. తెలంగాణ సీనియర్ రాజకీయ నాయకుడు ఎర్రబెల్లి దయాకర రావును ఆయనేదో అవమానించేసినట్లు సోషల్ మీడియాలో, మీడియాలో ప్రచారం జరిగిపోవడంతో ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
లెజెండరీ నటుడు మోహన్ బాబు సినీ రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లోని ఒక హోటల్లో పెద్ద పార్టీ ఇచ్చారు. దీనికి బ్రహ్మానందంతో పాటు చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. అందులో ఎర్రబెల్లి దయాకరరావు కూడా ఉన్నారు. ఐతే తనకు ఎదురు పడ్డ బ్రహ్మానందంను చేయి పట్టుకుని ఆపి ఫొటో దిగుదాం రా అన్నట్లు దయాకరరావు పిలవగా.. బ్రహ్మి ఆయన్నుంచి చేయి విడిపించుకుని వెళ్లిపోయారు.
ఆ దృశ్యం చూస్తే బ్రహ్మి కొంచెం దురుసుగా ప్రవర్తించినట్లు అనిపించడం సహజం. ఈ వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేసేశారు. ఎర్రబెల్లిని అవమానించిన బ్రహ్మానందం అంటూ దాన్ని వైరల్ చేశారు. దీంతో బ్రహ్మి బాగా బద్నాం అయిపోయారు. మీడియా వాళ్ల ద్వారా విషయం తన వరకు రావడంతో బ్రహ్మి అపార్థాన్ని తొలగించేందుకు ఒక వీడియో రిలీజ్ చేశారు. దయాకరరావు, తాను 30 ఏళ్లుగా స్నేహితులమని.. తమ మధ్య ఎంతో చనువు ఉందని ఆయన తెలిపారు. ఆ వీడియోలో దృశ్యానికి ముందే తాము కలిశామని.. ఆ తర్వాత కూడా కలిసి చాలాసేపు మాట్లాడుకున్నామని బ్రహ్మి తెలిపారు.
ఆయనతో తనకున్న చనువుకొద్దీ ఫొటో కోసం అడిగితే ఉండవయ్యా అంటూ విడిపించుకుని వెళ్లానని.. కానీ అది చూసి తమ మధ్య ఉన్న రిలేషన్ తెలియకుండా కొందరు తానేదో ఆయన్ని అవమానించినట్లు భావించి ఆ వీడియోను వైరల్ చేశారని బ్రహ్మి తెలిపారు. దయచేసి ఈ వీడియో చూసి ఎవరూ అపార్థం చేసుకోవద్దని ఆయన కోరారు. ముందు ఈ వీడియో చూసి తాను, దయాకరరావు నవ్వుకున్నామని.. కానీ జనం అపార్థం చేసుకోవడంతో తాను ఇలా స్పందించాల్సి వచ్చిందని.. దయాకరరావు కూడా వీడియో చూసి అందరూ అపార్థం చేసుకున్నారే అని ఫీలయ్యారని బ్రహ్మి వివరించారు.