వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి తాజాగా సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడు గులు వేస్తున్నారు. అవసరమైతే కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నట్టు తెలిపారు. అయితే.. ఇప్పటికిప్పుడు దాని పై ఎలాంటి ఆలోచనా చేయడం లేదని చెప్పారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో రాజకీయాలపై ఆలోచన చేస్తున్నట్టు చెప్పారు. అవసరమైతే.. కొత్తగా రాజకీయ పార్టీ పెట్టే విషయంలో గట్టి నిర్ణయమే తీసుకుంటానన్నారు. ప్రస్తుతం ఈ విషయంపై తన అనుచరులు, బంధువులు, మిత్రులతో చర్చిస్తున్నానన్నారు.
అదేసమయంలో రాజకీయంగా తనపై వత్తిడిలు వస్తున్నాయన్న సాయిరెడ్డి.. ఎవరి వత్తిడికీ లొంగేది లేదన్నారు. తాను రాజకీ యాల్లో ఉండాలో.. వ్యాపారాలు చేసుకోవాలో అనేది తన వ్యక్తిగత వ్యవహారమని అన్నారు. అయితే.. రాజకీయాల్లోకి రావాలని అనుకుంటే తనను ఎవరూ నిలువరించలేరన్నారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన.. కొద్ది మంది మీడియా మిత్రులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలు రాజకీయ పరమైన అంశాలపై స్పందించారు. తనను చేర్చుకుంటానని ఏ పార్టీ కానీ, ఏ నాయకుడు కానీ రాలేదన్నారు. వచ్చినా.. తాను ఇతర పార్టీల్లో చేరే అవకాశం లేదన్నారు.
రాజకీయంగా అనేక సంవత్సరాల నుంచి అనుభవం గడించినట్టు సాయిరెడ్డి చెప్పారు. కేంద్రంలోనూ తనకు మంచి పలుకుబడి ఉందన్నారు. అయితే.. ఒకసారి వద్దని అనుకున్న తర్వాత.. తిరిగి రాజకీయాల్లోకి రావడం సరికాదని తన మనసు చెబుతు న్నట్టు తెలిపారు. ప్రజల కోణంలో ఆలోచన చేస్తే.. తాను రాజకీయాల్లో ఉంటేనే బెటర్ అని అనిపిస్తోందన్నారు. ఇక, తాను రాజకీ యాల్లోంచి బయటకు వచ్చాక.. తనను టార్గెట్ చేస్తూ.. పలువురు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని.. కానీ, అది సరికాదన్నారు. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత జీవితం ఉంటుందన్నారు. అయినా.. తనను విమర్శిస్తున్నారని తెలిపారు.
జగన్ అలా చేసే..
ఇక, వైసీపీ అధినేత జగన్ గురించి స్పందిస్తూ.. తన చుట్టూ కోటరీ ఉందని.. దానివల్లే ఆయన నష్టపోయారని.. ఇంకా నష్టపోతున్నారని సాయిరెడ్డి చెప్పారు. `` జగన్ చుట్టూ ఉన్న కోటరీ ఆయన్ని డైవర్ట్ చేస్తోంది. నిబద్ధత లేని వారు చాలా మంది ఆయన చుట్టూ ఉన్నారు. ఆయన వారి మాటలే వింటున్నారు. ఇది వ్యక్తిగతంగా జగన్‌కు, పార్టీకి కూడా నష్టం చేస్తుంది.`` అని సాయి రెడ్డి చెప్పారు. ఏ ఉద్దేశంతో అయినా పార్టీ పెట్టారో.. ఆఉద్దేశం నెరవేరడం లేదన్నారు. ఇది పార్టీగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోందని చెప్పారు.
పవన్‌తో సుదీర్ఘ స్నేహం
తనకు-ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు మధ్య సుదీర్ఘ సంబంధం ఉందని సాయిరెడ్డి చెప్పారు. దాదాపు 20 ఏళ్లుగా తాను-పవన్ స్నేహంగా ఉన్నామని చెప్పారు. ఆయనను ఎప్పుడూ...పన్నెత్తు మాట కూడా అనలేదని సాయిరెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. త్వరలోనే ఏర్పాటు చేసే కొత్త జిల్లాలకు.. ఒకదానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలన్నారు. ముఖ్యంగా కర్నూలు జిల్లాకు ఈ పేరు పెట్టాలని తాను భావిస్తున్నానని.. ఈ విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలని సాయిరెడ్డి సూచించారు.