బాహుబలితో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదగడం బాగానే ఉంది కానీ.. అక్కడ్నుంచి తన సినిమాల్లో రొమాన్స్ తగ్గిపోయిందనే ఒక టాక్ ఉంది. రాధేశ్యామ్ లో పూజా హెగ్డేతో కెమిస్ట్రీ బాగానే పండినా.. ఆ సినిమా డిజాస్టర్ అయింది. కల్కి, సలార్ చిత్రాల్లో అసలు రొమాన్సుకు స్కోపే లేకపోయింది. ఈ విషయంలో ప్రభాస్ కూడా కొంచెం ఫీలయ్యాడంటూ చమత్కరించిన మారుతి.. తన దర్శకత్వంలో రెబల్ స్టార్ నటించిన రాజా సాబ్ లో ఏకంగా ముగ్గురు హీరోయిన్లను పెట్టేశాడు. వాళ్లే.. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్.
వీరిలో నిధి, మాళవిక బాగానే పాపులర్. వాళ్లు పెద్ద పెద్ద సినిమాలు కూడా చేశారు. కానీ రిద్ధి కుమార్ చిన్న స్థాయి కథానాయికే. ఆమె తెలుగులో రాజ్ తరుణ్ సరసన ‘లవర్’ అనే చిన్న సినిమాలో నటించింది. తర్వాత ఏవో చిన్న సినిమాలు చేసింది. ప్రభాస్ ‘రాధేశ్యామ్’లోనూ నటించినప్పటికీ.. తనది చిన్న పాత్ర. అలాంటి కథానాయికను ‘రాజా సాబ్’లో ఒక హీరోయిన్‌గా ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగించేదే. ఈ విషయంలో తాను కూడా షాకైనట్లు చెబుతోంది రిద్ధి కుమార్.
‘రాజా సాబ్’లో తానూ ఒక హీరోయిన్ అని చెప్పినపుడు అది ప్రాంక్ అయ్యుంటుందని లైట్ తీసుకుందట రిద్ధి కుమార్. ‘రాజా సాబ్’లో ఛాన్స్ గురించి తనకు నిర్మాతల్లో ఒకరు, దర్శకుడు మారుతి స్నేహితుడు అయిన ఎస్కేఎన్ కాల్ చేసినట్లు రిద్ధి వెల్లడించింది. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లుంటారని.. ఒక పాత్రకు తనకు ఇద్దామనుకుంటున్నారని ఎస్కేన్ చెప్పాడని.. ఐతే ఆయన తనపై ప్రాంక్ చేస్తున్నారని తాను అనుకున్నానని రిద్ధి తెలిపింది.
ఐతే తర్వాత తన మేనేజర్‌ను దీని గురించి అడిగితే.. ‘రాజాసాబ్’లో ఛాన్స్ నిజమేనని చెప్పాడని.. అప్పుడు తన ఆనంధానికి అవధులు లేవని రిద్ధి చెప్పింది. ఈ సినిమాలో తన పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆమె ధీమా వ్యక్తం చేసింది. ఈ చిత్రంలో రిద్ధి ఫుల్ గ్లామర్ టచ్ ఉన్న పాత్ర చేసిందని ప్రోమోలు చూస్తే అర్థమవుతోంది. ఇటీవలే రిలీజ్ చేసిన ‘రెబల్ సాబ్’ సాంగ్‌లోనూ రిద్ధి మెరిసింది. సంక్రాంతి కానుకగా జనవరి 9న ‘రాజా సాబ్’ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.