మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా ఉన్నప్పటి నుంచి.. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్‌తో మంచి అనుబంధమే ఉంది. వెంకీ కెరీర్లో మైలురాయిగా నిలిచిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాలకు రచన చేసింది త్రివిక్రమ్‌దే. ఐతే తర్వాత దర్శకుడిగా గొప్ప స్థాయికి ఎదిగిన త్రివిక్రమ్.. వెంకీతో కెరీర్ ఆరంభంలోనే సినిమా చేయాలనుకున్నాడు. కానీ ఎందుకో ఈ కాంబినేషన్ కుదర్లేదు. ఎన్నో ఏళ్ల ముందే ఈ కలయికలో ఒక సినిమాను అనౌన్స్ చేసినప్పటికీ.. అది ముందుకు కదల్లేదు.
ఇక ఎప్పటికీ ఈ కాంబో ఉండదేమో అనుకున్నారంతా. కానీ గుంటూరు కారం తర్వాత మైథాలజీ స్టోరీతో త్రివిక్రమ్ చేయాల్సిన భారీ చిత్రం.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడడంతో సడెన్‌గా ఆయన వెంకీ వైపు తిరిగారు. ఇద్దరి కాంబినేషన్‌కు సరిపోయే ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథ రెడీ చేశాడు. కొన్ని రోజుల కిందటే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. షూటింగ్ కూడా మొదలైపోయింది.
చిత్రీకరణ ఆరంభ దశలో ఉండగానే ఈ సినిమా టైటిల్ గురించి ఓ వార్త బయటికి వచ్చేసింది. అత్తారింటికి దారేది, అరవింద సమేత, అల వైకుంఠపురములో లాంటి టైటిళ్ల తరహాలోనే ఒక ఆహ్లాదకరమైన, తెలుగుదనం ఉన్న టైటిల్ పెడుతున్నాడట త్రివిక్రమ్ ఈ సినిమాకు. అదే.. బంధుమిత్రుల అభినందనలతో. ఈ పదాలను తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో చదివే ఉంటారు. తెలుగు వారి శుభలేఖల్లో చివరగా కనిపించే మాట ఇది. దీన్నే టైటిల్‌గా పెట్టాలన్న త్రివిక్రమ్ ఆలోచన అభినందనీయం.
ఈ టైటిల్‌ను బట్టి ఇది ఒక పెళ్లి చుట్టూ తిరిగే సినిమా అనే అంచనాకు వస్తారేమో.మరి ఆ అంచనాకు తగ్గ సినిమానే తీస్తాడా.. ఇంకేమైనా కొత్తగా చూపిస్తాడా అన్నది ఆసక్తికరం. త్రివిక్రమ్‌కు హోం బేనర్‌లా మారిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్లోనే ఈ సినిమా కూడా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి శ్రీనిధి శెట్టిని కథానాయికగా పరిశీలిస్తున్నట్లు ఇంతకుముందు వార్తలు వచ్చాయి. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదలయ్యే అవకాశముంది.