ప్రేమ అంటే ఇద్దరి మనసులు కలవడం. ఇద్దరి జీవితాలు ఒకటవడం. కానీ మన సమాజంలో ఈ సహజమైన విషయాన్నే అంగీకరించకుండా అడ్డుకునే ఒక పెద్ద రాక్షసం ఇప్పటికీ ఉంది.. అదే కులం. కాలం మారింది, ప్రపంచం స్పేస్ స్టేషన్ల వరకు వెళ్లింది. అయినప్పటికీ ప్రేమ విషయంలో మాత్రం కులం మనుషుల మనసుల్లోనే కాదు, వారి నిర్ణయాల్లో కూడా ప్రధాన విలన్‌గా నిలుస్తూనే ఉంది.
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో అంచల్–సాక్షిం ట్రాజిక్ లవ్ స్టోరీ దీనికి తాజా ఉదాహరణ. నాందేడ్ జిల్లాలో అంచల్ అనే యువతి, సాక్షిం అనే యువకుడు ప్రేమలో పడ్డారు. మూడు సంవత్సరాలు సాగిన వారి ప్రేమ బలమైన బంధంగా మారింది. కానీ కులమతాల పేరుతో ఇద్దరి కుటుంబాల మధ్య రోజురోజుకూ ఉద్రిక్తతలు పెరిగాయి. అంచల్ తండ్రి, అన్నలు ఏకంగా ఈ ప్రేమను అడ్డుకునేందుకు హింసాత్మక మార్గం ఎంచుకున్నారు.
మూడు రోజుల క్రితం సాక్షింపై అంచల్ అన్నలు దాడి చేశారు. రాళ్లతో కొట్టి సాక్షింను చంపడంతో.. అంచల్ తండ్రితో పాటు అన్నలిద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటనలో సాక్షిం ప్రాణం పోయింది… కానీ అంచల్ ప్రేమ మాత్రం చనిపోలేదు. సాక్షిం అంత్యక్రియలకు వెళ్లిన అంచల్, మృతదేహం పక్కనే నిశ్శబ్దంగా కూర్చుంది. కాసేపటి తర్వాత ఎవరూ ఊహించని విధంగా సాక్షిం శవానికి పసుపు రాసింది… కుంకుమ పెట్టింది… తన నుదుటిపై కూడా బొట్టు పెట్టుకుంది. “నేనే నీ భార్యను… ఇప్పుడు కూడా నిన్నే పెళ్లి చేసుకుంటున్నాను” అని అరుస్తూ కన్నీరు పెట్టుకోవడంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా కదిలిపోయారు.
“నా తండ్రి, నా అన్నలు సాక్షింని చంపేశారు… కానీ మా ప్రేమను చంపలేకపోయారు. నేను జీవితాంతం సాక్షిం ఇంట్లోనే ఉంటాను. అతని అమ్మానాన్నకు కోడలిగానే ఉంటాను” అని ప్రకటించింది. ఆమె మాటలు విన్న సాక్షిం తల్లిదండ్రులు కూడా అంచల్‌ని ఆలింగనం చేసుకుని ఆమెను కోడలిగా అంగీకరించారు. ఆ క్షణం సినిమా సీన్‌లా అనిపించినా, ఇది నిజజీవితం. నిజమైన ప్రేమ. నిజమైన వేదన!