విపరీత ఘటనలు ఈ మధ్యన తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఆ కోవకు చెందిన ఉదంతం ఒకటి తాజాగా తమిళనాడులో చోటుచేసుకుంది. విన్నంతనే ఉలిక్కిపడేలా ఉన్న ఈ ఉదంతంలోకి వెళితే.. గొడవలతో విడిగా ఉంటున్న భార్య ఉంటున్న ప్లేస్ కు వెళ్లి.. దారుణంగా హత్య చేయటమే కాదు..వాట్సప్ స్టేటస్ గా షేర్ చేసుకోవటం సంచలనంగా మారింది.
అసలేం జరిగిందంటే..
తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ దారుణ హత్య చోటు చేసుకుంది. నెల్లై జిల్లా మేలపాళయం సమీపంలోని బాలమురగన్ కు.. శ్రీప్రియలు భార్యభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్యభర్తల మధ్య గొడవలతో వీరిద్దరూ విడిగా ఉంటున్నారు. భర్త.. పిల్లలకు దూరంగా శ్రీప్రియ కోయంబత్తూరుకు వచ్చి రేస్ కోర్సు సమీపంలోని ఒక హాస్టల్ లో ఉంటోంది.
స్థానికంగా ఒక బట్టల షాపులో పని చేస్తోంది. తన నుంచి విడిపోయిన తర్వాత ఒక యువకుడితో శ్రీప్రియ సన్నిహితంగా ఉండటం.. సదరు వ్యక్తితో కూడిన ఫోటోను వాట్సప్ స్టేటస్ గా పెట్టుకోవటంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఆదివారం ఉదయం శ్రీప్రియ ఉంటున్న మహిళా హాస్టల్ కు వెళ్లిన బాలమురుగన్.. ఆమెను కలిసినంతనే వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య చోటు చేసుకున్న వాదన ఘర్షణగా మారింది.
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతను కోపంతో తన వెంట తెచ్చుకున్న కొడవలితో ఆమెపై దాడికి దిగాడు. అనంతరం భార్య డెడ్ బాడీతో తీసుకున్న ఫోటోను తన వాట్సప్ స్టేటస్ లో పెట్టాడు. అందులో ‘‘ద్రోహానికి ఫలితం.. మరణం’’ అంటూ క్యాప్షన్ జోడించాడు. ఈ హత్య తమిళనాడు వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఈ ఉదంతం గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని బాలమురుగన్ ను అరెస్టు చేశారు. శ్రీప్రియ డెడ్ బాడీని పోస్టుమార్టానికి తరలించారు.