కొన్ని నెలలుగా చాలామంది అనుకుంటున్నదే ఈ రోజు జరిగింది. కొన్నేళ్ల ముందు అక్కినేని నాగచైతన్య నుంచి విడిపోయిన సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు.. ఈ రోజు మళ్లీ పెళ్లి చేసుకుంది. ‘ఫ్యామిలీ మ్యాన్’ సహా పలు వెబ్ సిరీస్‌లు, అనేక సినిమాలు తీసిన దర్శక ద్వయంలో ఒకరైన రాజ్ నిడిమోరును ఆమె పెళ్లాడారు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ఈషా ఫౌండేషన్లో నిరాడంబరంగా వీరి పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది.
కొంత కాలంగా రాజ్-సమంత రెగ్యులర్‌గా ఈషా ఫౌండేషన్‌కు వెళ్తున్నారు. సద్గురు జగ్గీ వాసుదేవ్ నిర్వహించే ఆ ఫౌండేషన్‌కు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి ఆధ్యాత్మిక చింతనతో ఫాలోవర్లు వస్తుంటారు. సమంత, రాజ్ కూడా అక్కడికి రెగ్యులర్ విజిటర్లుగా మారారు. తమకు అనుబంధం ఏర్పడ్డ ఆ ప్రదేశంలోనే పెళ్లి చేసుకోవాలని రాజ్, సామ్ నిర్ణయించుకున్నారు. తక్కువమంది సన్నిహితుల మధ్య వీరి పెళ్లి చాలా సింపుల్‌గా జరిగిపోయినట్లు తెలుస్తోంది. నాగచైతన్య తన రెండో పెళ్లిని ఆడంబరంగానే చేసుకున్నాడు కానీ.. సమంత మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది.
ఇదిలా ఉంటే.. రాజ్‌తో సమంత వివాహ వేళ ఒక సోషల్ మీడియా పోస్టు వైరల్ అవుతోంది. రాజ్ మాజీ భార్య శ్యామాలి.. ‘‘తెగించిన వ్యక్తులు అందుకు తగ్గట్లే తెగించే పనులే చేస్తారు’’ (Desperate people do desperate things) అనే నోట్‌ను శ్యామాలి షేర్ చేశారు. సమంత, రాజ్‌ల పెళ్లిని ఉద్దేశించే ఆమె ఈ పోస్టు పెట్టారనే చర్చ జరుగుతోంది. రాజ్‌తో సమంత బంధం గురించి ఆమె మొదట్నుంచి ఇలాగే నెగెటివ్‌గా స్పందిస్తున్నారు.
ఒకప్పుడు రాజ్ అసిస్టెంట్ అయిన శ్యామాలి.. తర్వాత తననే పెళ్లి చేసుకుంది. ఐతే కొన్నేళ్లకు వీరి మధ్య విభేదాలు వచ్చాయి. సమంత పరిచయం అయ్యాకే రాజ్ తనకు పూర్తిగా దూరం అయ్యాడని.. విడాకులు కూడా తీసుకోవాల్సి వచ్చిందని ఆమె ఆవేదనతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాజ్, సమంతల పెళ్లి వేళ ఇలా పోస్టు పెట్టి తన ఆక్రోశాన్ని వెళ్లగక్కుతోందనే చర్చ జరుగుతోంది.