పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న సమయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ, లోక్‌సభలో విపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీలపై ఢిల్లీలోని కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) తాజాగా రెండు వేర్వేరు కేసులు నమోదు చేసింది. దీనిపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. పార్లమెంటులో తాము సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. ఇలా చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఏంటా కేసులు?
నెహ్రూ హయాంలో స్థాపించిన నేషనల్ హెరాల్డ్ పత్రిక వాటాల కేసు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసును ఎన్ ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్ విచారిస్తోంది. ఇప్పటికే రెండు మూడు సార్లు ఈ కేసులో సోనియా, రాహుల్ గాంధీలు విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా.. మనీలాండరింగ్ జరిగిందని ఈడీ అధికారులు గుర్తించారు. ఈ సమాచారాన్ని ఈవోడబ్ల్యూ కు చేరవేశారు. దీని ఆధారంగానే తాజాగా ఆదివారం... రెండు ఎఫ్ ఐఆర్‌లు నమోదయ్యాయి.
సోనియా, రాహుల్‌తో పాటు.. మరో ఆరుగురు వ్యక్తులపై కూడా వేర్వేరుగా ఎఫ్ ఐఆర్‌లు నమోదు చేశారు. నేషనల్ హెరాల్డ్‌కు చెందిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తులను వీరు 8 మంది.. కేవలం 50 లక్షలు మాత్రమే చెల్లించి.. సొంతం చేసుకున్నారని ఎఫ్ ఐఆర్‌లో నమోదు చేశారు. వీరు చేజిక్కించు కున్న ఆస్తుల విలువ 2 వేల కోట్ల రూపాయల పైగానే ఉంటుందని కేసులో ప్రస్తావించారు. ఇక, వీరు నమోదు చేసిన కేసులో గతంలో మరణించిన మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్‌ల పేర్లు కూడా ఉండడం గమనార్హం.