అఖండ సినిమాకు రిలీజ్ తర్వాత అనుకోకుండా పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ దక్కింది. కొంతమేర థియేటర్లలోనూ హిందీ ఆడియన్స్ ఈ సినిమాను చూశారు. ఓటీటీలో వచ్చినపుడైతే ఈ సినిమాకు ఇతర భాషల ప్రేక్షకుల నుంచి కూడా మంచి అప్లాజ్ వచ్చింది. ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులు ఆన్ లైన్లో ఈ సినిమాను విరగబడి చూశారు.
డివైన్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలకు నార్త్ ఆడియన్స్ ఈ మధ్య తెగ కనెక్ట్ అయిపోతున్న నేపథ్యంలో.. అఖండ-2ను వారి అభిరుచికి తగ్గట్లే రూపొందించాలని టీం ఫిక్సయ్యే రంగంలోకి దిగింది. ఫస్ట్ పార్ట్‌కు హైలైట్‌గా నిలిచిన అఘోరా పాత్రతో పాటు కథ విస్తృతిని కూడా పెంచి.. ఈ చిత్రాన్ని భారీగా తీర్చిదిద్దాడు బోయపాటి. ఈ చిత్రాన్ని నార్త్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ చేయడం కోసం పలువురు బాలీవుడ్ నటులను కూడా ఈ సినిమాలోకి తీసుకున్నారు.
కల్కి చిత్రంలో విలన్ పాత్ర పోషించిన సస్వత ఛటర్జీ అందులో ఒకడు. ఇంకా కొందరు నార్త్ నటులు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. అందులో హర్షాలీ మల్హోత్రా ఒకరు. అఖండ-2 ట్రైలర్లో అఘోరాగా ఉన్న బాలయ్యను నాన్నా అని పిలుస్తూ ఒక అమ్మాయి అందరి దృష్టినీ ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఆ అమ్మాయే హర్షాలీ మల్హోత్రా. ఈమెను చూస్తే కొత్త నటి అనిపిస్తుంది కానీ.. పదేళ్ల ముందు ఓ సినిమాలో బాలనటిగా దేశం మొత్తాన్ని ఆకట్టుకుంది.
సల్మాన్ ఖాన్ బ్లాక్ బస్టర్ మూవీ ‘భజరంగి భాయిజాన్’లో పాకిస్థాన్ నుంచి ఇండియాకు వచ్చి తప్పిపోయే అమ్మాయి పాత్రను చేసింది హర్షాలీనే. అమాయకత్వంతో కూడిన ఆ పాత్రలో ముద్దొచ్చేలా నటించిన హర్షాలీ.. తర్వాత పెద్దగా సినిమాల్లో నటించలేదు.
ఇప్పుడు యుక్త వయసులోకి వచ్చాక ఆమె.. తెలుగు సినిమా అయిన అఖండ-2తో రీఎంట్రీ ఇస్తుండడం విశేషం.
భజరంగి భాయిజాన్ తర్వాత తనకు చాలా అవకాశాలు వచ్చినా ఒప్పుకోలేదని.. అఖండ-2 లాంటి మూవీతో రీఎంట్రీ ఇస్తుండడం ఆనందంగా ఉందని ఆమె చెప్పింది. ఈ చిత్రంలో తాను జనని అనే పాత్రలో కనిపిస్తానని.. కథలో తన పాత్ర కీలకమని.. తనకు ఆపద వచ్చినపుడల్లా అఖండ వస్తాడని ఆమె చెప్పింది.