అధికారం ‘చేతి’లో ఉంచుకొని చేజార్చుకునే దరిద్రపుగొట్టు లక్షణం కాంగ్రెస్ నేతలకు ఉన్నంతగా దేశంలో మరే రాజకీయ పార్టీకి ఉండదనే చెప్పాలి. అది తెలంగాణలో అయినా.. కర్ణాటకలో అయినా. ప్రత్యర్థి పార్టీలు చేసే తప్పులు వరంగా మారి అధికారం చేతికి వచ్చినప్పుడు దాన్ని నిలుపుకునే దాని కంటే చెడ్డగొట్టుకోవటం కోసం ఎంత చేయాలో అంత చేయటంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకరికి మించి మరొకరు ఎత్తులు.. పైఎత్తులు వేస్తుంటారు.
గడిచిన కొద్దిరోజులుగా కర్ణాటక రాజకీయాల్ని ఫాలో అవుతున్న వారు ఎవరికైనా ఈ భావన కలగటం ఖాయం. కర్ణాటక అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయాన్ని సాధించిన వేళ.. సీఎం పీఠం కోసం పోటాపోటీ పడిన సిద్దరామయ్య.. డీకే శివకుమార్ ల విషయంలో రాజీ ఫార్ములా సిద్ధం చేసిన కాంగ్రెస్ అధిష్ఠానం.. ఇద్దరు నేతల్ని ఒప్పించింది. ఐదేళ్ల అధికారాన్ని రెండున్నరేళ్ల చొప్పున పంచుకోవాలన్న మాటకు కట్టుబడి ఉండాలన్న దానికి ఇరువురు నేతలు ఓకే చెప్పేసుకోవటం బహిరంగ రహస్యమే.
అనుకున్నట్లే రెండున్నరేళ్లు గడిచిపోవటం.. మాట ప్రకారం సీఎం సిద్దరామయ్య తన పదవికి రాజీనామా చేస్తే.. డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అయితే.. సిద్దరామయ్య తన సీఎం పదవికి రాజీనామా చేసే విషయంలో ససేమిరా అనటం.. అందుకు డీకే నొచ్చుకోవటంతో మొదలైన రచ్చ.. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఏం చేయాలో నిర్ణయించుకునేలోపు.. ఈ ఇరువురు నేతలు నర్మగర్భంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవటంతో పాటు.. వరుస పెట్టి చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు కాంగ్రెస్ పార్టీ దీనస్థితిని అందరికి అర్థమయ్యేలా చేసింది.
మొత్తానికి ఏం జరిగిందో కానీ.. ఒప్పందంలో భాగంగా తనకు సీఎం పదవిని అప్పజెప్పాలన్న మాటను పక్కన పెట్టేశారు. ఆయనకు ఎలాంటి హామీ లభించిందో కానీ.. సీఎంగా సిద్దూ కంటిన్యూ అయ్యేందుకు డీకే సరేనని చెప్పటంతో కర్ణాటక కాంగ్రెస్ రాజకీయం కుదుటపడినట్లైంది. అయితే.. ఆ విషయాన్ని అలా వదిలేసినా బాగుండేది. తాజాగా డీకే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో తనకు ఎలాంటి విభేదాలు లేవని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడిగా తన పరిధులేంటో తనకు తెలుసన్న ఆయన.. ‘‘ఇప్పటివరకు మేం ఎప్పుడూ బేధాభిప్రాయాలు వ్యక్తం చేయలేదు. మేమిద్దరం కలిసే పని చేస్తున్నాం.
కర్ణాటక ప్రజలకు వారి భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు ఉన్నాయి. వాటిని నెరవేర్చటం కోసం మేమంతా కలిసి పని చేయాలని అనుకుంటున్నాం’’ అంటూ పూర్తి పాజిటివ్ గా మాట్లాడారు. అంతేకాదు.. 2028, 2029లో అధికారాన్ని సాధించటమే తమ ముందున్న లక్ష్యంగా చెప్పుకున్న డీకే..దాని కోసమే తాము పని చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.
ఈ మాటలన్ని విన్న తర్వాత డీకేను ఒక ప్రశ్నను అడగాలనిపిస్తుంది. ఇంతకూ డీకేకు.. సీఎం సిద్దరామయ్యకు విభేదాలు ఉన్నాయని ఎవరన్నారు? ఆయన తాజా క్లారిటీ ఎవరికి? వారికి వారే విభేదాలు ఉన్నట్లుగా ఎక్స్ లో పోస్టులు పెట్టుకొని.. ప్రజల అటెన్షన్ తమ మీద పడేలా చేసుకొని..ఈ రోజున లేవని చెప్పటంలో అర్థం లేదు. ఏమైనా.. ఇలా సెల్ఫ్ గోల్ చేసుకోవటం కాంగ్రెస్ నేతలకు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదని చెప్పాలి.