స్టార్ హీరోల కొడుకులు ఈజీగానే స్టార్లు అయిపోతారు కానీ.. నిర్మాతల పిల్లలకు స్టార్ ఇమేజ్ రావడం అంత తేలిక కాదు. వెంకటేష్, జగపతిబాబు లాంటి కొంతమందికి మాత్రమే ఇది సాధ్యమైంది. ఐతే స్రవంతి రవికిషోర్ అన్న కొడుకైన రామ్ త్వరగానే స్టార్‌గా నిలదొక్కుకున్నాడు. తన తొలి చిత్రం ‘దేవదాస్’ బ్లాక్ బస్టర్ కావడంతో అతను వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. రెడీ, కందిరీగ లాంటి పెద్ద హిట్లతో మిడ్ రేంజ్ హీరోల్లో ఒకడిగా ఎదిగాడు.
కానీ అక్కడ్నుంచి ఇంకో స్థాయికి వెళ్లడానికి అతను చేస్తున్న ప్రయత్నం మాత్రం ఫలించడం లేదు. గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులతో ఉన్న స్థాయి నుంచి కూడా కొంచెం కిందికి దిగిపోతున్నాడు. చాలామంది మిడ్ రేంజ్ స్టార్లకు యుఎస్‌లో మిలియన్ డాలర్ల వసూళ్లు అన్నవి ఈజీ అయిపోయాయి. కొన్ని చిన్న సినిమాలు కూడా ఈ ఘనత సాధించాయి. కానీ రామ్‌కు మాత్రం మిలియన్ డాలర్ క్లబ్ అన్నది కలగానే మిగిలిపోయింది.
అతను ఎక్కువగా యుఎస్ ఆడియన్స్ అభిరుచికి సూట్ కాని మాస్ సినిమాలు చేస్తుండడం వల్లే మిలియన్ డాలర్ వసూళ్లు సాధ్యం కావట్లేదు. ‘నేను శైలజ’ 7 లక్షల డాలర్లకు దగ్గరగా సాధించిన వసూళ్లే తన కెరీర్లో రికార్డుగా ఉంది. దాన్ని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’తో అధిగమించి మిలియన్ డాలర్ క్లబ్బులోకి చేరాలని రామ్ టార్గెట్ పెట్టుకున్నాడు. ఇది యుఎస్ ఆడియన్స్ టేస్టుకు తగ్గ క్లాస్ మూవీ కావడంతో ఈసారి టార్గెట్ చేరుకోవడం సాధ్యమే అనుకున్నాడు. పైగా రిలీజ్ టైంలో హీరోయిన్ భాగ్యశ్రీతో కలిసి యుఎస్ టూర్ కూడా ప్లాన్ చేశాడు. ఐతే శనివారానికి హాఫ్ మిలియన్ వసూళ్లతో ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ బాగానే కలెక్షన్లు రాబట్టింది. ఆదివారం కూడా మెరుగైన వసూళ్లే ఉంటాయని భావిస్తున్నారు.
అయినా సరే మిలియన్ డాలర్ మార్కును అందుకోవడం కష్టమే అనిపిస్తోంది. ఎందుకంటే వచ్చే వీకెండ్లో ‘అఖండ-2’ లాంటి భారీ చిత్రం వస్తోంది. ఆ చిత్రానికి గురువారమే ప్రిమియర్స్ పడనున్నాయి. భారీ అంచనాలనున్న బాలయ్య సినిమా పోటీని తట్టుకుని నిలబడ్డం తేలిక కాదు. కాబట్టి మిలియన్ డాలర్ మార్కును అందుకోవడం సందేహమే. యుఎస్‌లో ఈ టార్గెట్ కోసమని.. తెలుగు రాష్ట్రాల్లో సినిమాను సరిగా ప్రమోట్ చేసుకోలేకపోయాడు రామ్. భాగ్యశ్రీతో కలిసి అక్కడ చేస్తున్న ప్రమోషన్ ఇక్కడ చేసి ఉంటే.. ఇక్కడ వసూళ్లు మరింత ఎక్కువగా వచ్చేవి. దీన్ని బట్టి చూస్తే రామ్ ప్లాన్ రెండు విధాాలా చెడినట్లే కనిపిస్తోంది.