కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. తన వ్యాఖ్యలపై పవన్ క్షమాపణలు చెప్పాల్సిందేనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తదితరులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారి వ్యాఖ్యలపై జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.
రైతులతో ముచ్చటిస్తున్న సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని జనసేన ఆ ప్రకటనలో పేర్కొంది. ఇరు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడిన క్రమంలో పవన్ వ్యాఖ్యలను వక్రీకరించవద్దని కోరింది. మరి, జనసేన అధికారిక ప్రకటన తర్వాత తెలంగాణ నేతలు శాంతిస్తారా లేక పవన్ క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టుబడతారా అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ తెలంగాణ నేతలు శాంతించకుంటే పవన్ కల్యాణ్ నేరుగా ఏదైనా ప్రకటన విడుదల చేస్తారా అన్న విషయం ఆసక్తికరంగా మారింది.