అవును.. పేర్లు మార్చే విషయంలో నరేంద్ర మోడీ సర్కారు చూపించే ఆసక్తి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు సుపరిచితమైన పీఎంవో (ప్రధానమంత్రి కార్యాలయం)ను ఇకపై సేవా తీర్థ్ గా వ్యవహరిస్తారు. అంతేకాదు.. ఇప్పటివరకు ఉన్న చోటు నుంచి ప్రధానమంత్రి కార్యాలయం కొత్త కాంప్లెక్స్ లోకి మారనుంది. ఈ కొత్త సముదాయాన్ని సేవా తీర్థ్ గా పిలుస్తారు. తుది దశలోకి చేరిన ఈ కొత్త కాంప్లెక్స్ పేరుకు తగ్గట్లే.. సేవా స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఉంటుందని చెబుతున్నారు. పరిపాలన పరిమైన సత్తా నుంచి సేవకు మారనున్నట్లుగా చెబుతున్నారు.
అదే విధంగా గవర్నర్ నివాసం పేరును సైతం మార్చారు. అంతేకాదు.. దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు ఉన్న రోడ్డును రాజ్ పథ్ గా పిలిచేవారు. తాజాగా దాని పేరును మార్చేవారు. ఒకటి తర్వాత ఒకటి చొప్పున మార్చిన పేర్లను చూస్తే.. గవర్నర్ నివాసాన్ని రాజ్ భవన్ గా వ్యవహరించేవారు. ఇప్పుడు దాని పేరును లోక్ భవన్ గా మారుస్తూ ఆదేశాలు జారీ చేశారు. అందుకు తగ్గట్లే.. మంగళవారం సాయంత్రం పేరును మారుస్తూ.. అందుకు తగ్గట్లు నివాసం బయట కొత్త పేరుతో బోర్డు ఏర్పాటు చేశారు.
ఢిల్లీలోని రాజ్ పథ్ రోడ్డును ఇకపై కర్తవ్య పథ్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. మోడీ హయాంలో మారిన కీలక స్థానాల్ని చూస్తే.. 2016లో ప్రధాని అధికారిక నివాసం పేరును లోక్ కల్యాణ్ మార్గ్ గా మార్చారు. కేబినెట్ సచివాలయాన్ని కర్తవ్య భవన్ గా మార్చారు. బ్రిటిష్ కాలం నుంచి ఉన్న పేర్లను మార్చటం ద్వారా.. వలసవాసనల్ని పూర్తిగామార్చటం.. కొత్త నిర్మాణాలతో.. కొత్త పేర్లను ఏర్పాటు చేయటం తెలిసిందే. సెంట్రల్ విస్టా పునరాభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా కీలకమైన ప్రభుత్వ కార్యాలయాలన్నిటినీ కొత్త ‘ఎగ్జిక్యూటివ్ ఎంక్లేవ్’కు మారుస్తున్నారు.
ఎగ్జిక్యూటివ్ ఎంక్లేవ్-1లో కొత్తగా మూడు భవనాల్ని నిర్మిస్తున్నారు. అందులో వాయుభవన్ సమీపంలో నిర్మిస్తున్న సేవాతీర్థ్ 1లో ప్రధానమంత్రి కార్యాలయం పని చేస్తుంది. ఇప్పటికే కార్యకలాపాలు మొదలయ్యాయి. సేవాతీర్థ్ 2లో కేంద్ర కేబినెట్ సచివాలయంఆగస్టు నుంచే పని చేస్తోంది. సేవా తీర్థ్ 3లో జాతీయ భద్రతా మండలి కార్యాలయం ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ ఎన్ క్లేవ్ 3లో ప్రధానమంత్రి నివాస సముదాయం రానుంది. ప్రభుత్వ కార్యాలయాలు పౌరులకే ప్రథమ ప్రాధాన్యమిస్తూ.. సేవ.. కర్తవ్యాల గురించి మాట్లాడేలా పేర్లు ఉన్నాయని చెబుతున్నారు. పేరుతో పాటు మైండ్ సెట్ మారితేనే ఫలితం ఉంటుందన్న విషయం ఎప్పటికి అర్థమవుతుందంటారు?