తెలంగాణలో ఒకవైపు పంచాయతీ పోరు సాగుతుండగా.. మరోవైపు.. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ భూముల అక్రమాల పేరిట పెద్ద యుద్ధానికే తెరదీసింది. బుధవారం, గురువారం రెండు రోజుల పాటు.. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకువచ్చిన `హిల్ట్` పాలసీపై కదనానికి రెడీ అయింది. ఏకంగా ఏనిమిది బృందాలను ఏర్పాటు చేయడంతోపాటు.. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా రంగంలోకి దిగుతుండడంతో దీనికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. `హిల్ట్` పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల కొత్త పాలసీ తీసుకువచ్చింది. అయితే.. దీనిలో అక్రమాలు ఉన్నాయన్నది బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చెబుతున్న వాదన.
ఏంటీ హిల్ట్?
హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్(హెచ్ఐఎల్‌టీ) పాలసీని కొన్నాళ్ల కిందట రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిం ది. దీనికింద.. హైదరాబాద్ చుట్టుపక్కల పారిశ్రామిక అభివృద్ధి కోసం కేటాయించిన భూములను `బహుళ ప్రయోజనాలకు` వినియోగించుకునేందుకు వీలు కల్పించారు. దీంతో విస్తరిస్తున్న మహానగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకునేందుకు మరిన్ని ఎక్కువగా అపార్టుమెంట్లు, విల్లాలను నిర్మించుకునేందుకు అవకాశం ఉంటుంది. వాస్తవానికి ఈ భూములను గత ప్రభుత్వాలు(ఉమ్మడి రాష్ట్రంతో కలిపి) పారిశ్రామిక అవసరాల కోసం సేకరించాయి. నగరం విస్తరించినప్పుడు వాటిని పరిశ్రమలకు కేటాయించాలని భావించారు.
అయితే.. ఇప్పుడు ఆ భూములను కేవలం పరిశ్రమల కోసమే కాకుండా.. ఇతర ప్రయోజనాలకు కూడా వినియోగించుకునేలా మార్పులు చేస్తూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ భూములు 9800 ఎకరాలకు పైగా ఉన్నాయి. నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో వీటి విలువ కూడా అమాంతం పెరిగింది. బీఆర్ ఎస్ నాయకులు చెబుతున్న లెక్క ప్రకారం.. వీటి విలువ సుమారు 5 లక్షల కోట్లకు పైగానే ఉంటుంది. అయితే.. ఈ భూములను పాత ఎస్ ఆర్ వో ప్రకారం.. దానిలోని 30 శాతం ధరలకే కట్టెబెడుతున్నారన్నది బీఆర్ ఎస్ నేత కేటీఆర్ చెబుతున్న మాట. దీని వెనుక భారీ కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో హిల్ట్ పాలసీని వ్యతిరేకిస్తూ.. రెండురోజుల పాటు పర్యటనలు పెట్టుకున్నారు. దీనికి గాను ఈ పారిశ్రామిక వాడలను 8 క్లస్టర్లుగా విభజించారు. మాజీ మంత్రులు, పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఎనిమిది బృందాలు బుధ, గురువారాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి.. ఆయా భూముల వాస్తవ మార్కెట్ విలువను.. అదేసమయంలో సర్కారు నిర్ణయించిన ధరలను మీడియా ద్వారా ప్రజలకు వివరించనున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం చేస్తున్న స్కాం(కేటీఆర్ చెప్పిన మేరకు)ను బయట పెట్టనున్నారు. ఇదీ.. వివాదం!. దీనిపై రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారన్నది చూడాలి.