ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పంతమే నెగ్గింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో విపక్షలు మూకుమ్మడిగా.. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకువచ్చిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)పై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. సోమవారం ప్రారంభమైన సమావేశాలు రెండు రోజుల పాటు దీని చుట్టూనే తిరిగాయి. అయితే..తొలుత సర్‌పై చర్చకు అవకాశం లేదని.. కావాలంటే.. ఎన్నికల సంఘం సంస్కరణలపై చర్చిస్తామని.. కేంద్రం స్పష్టం చేసింది. దీనికి విపక్షాలు ససేమిరా అన్నాయి. దీంతో ఉభయ సభల్లోనూ ప్రతిష్టంభన కొనసాగింది.
మంగళవారం మరింతగా విపక్షాలు సర్‌పై పట్టుబట్టడం.. ఉభయ సభలు కూడా ఇలా ప్రారంభమై అలా వాయిదా పడడంతో ఎట్టకేలకు ప్రభుత్వం సర్‌పై చర్చించేందుకు ముందుకు వచ్చింది.ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజుజు లోక్‌సభలో మంగళవారం సాయంత్రం ప్రకటించారు. సర్ చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దీనికి తగిన తేదీలను సూచించాలని.. ఆయన ప్రతిపక్షాలకే ఆప్షన్ ఇచ్చారు. దీంతో ఒక రోజు కాదు.. రెండురోజుల పాటు సర్‌పై చర్చించాలని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. దీనికి కూడా కేంద్రం ఓకే చెప్పింది.
ఈ నేపథ్యంలో ఈ నెల 9, 10 తేదీల్లో(మంగళ, బుధవారాలు) సర్‌పై చర్చించేందుకు కేంద్రం ఓకే చెప్పింది. అయితే.. కథ ఇక్కడితో అయిపోతే.. ప్రధాని మోడీ గురించి ప్రత్యేకంగా చర్చించుకునేది ఏముంటుంది? ఇక్కడే కీలక విషయాన్ని తెరమీదికి తెచ్చారు. జాతీయ గేయం వందేమాతరాన్ని కాంగ్రెస్ గత పాలకులు తీవ్రంగా అవమానించారని.. ఒరిజినల్ గేయంలోని కొన్ని పంక్తులను తొలగించారని ఆరోపిస్తున్న మోడీ.. దీనిని పార్లమెంటులో చర్చకు పెట్టాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు.. ఆయన వందేమాతరం గేయంలోని కొన్ని పంక్తులను తొలగించిన కారణంగానే దేశ విభజన జరిగిందని, దీనికి కాంగ్రెస్ పార్టీ కారణమని అంటున్నారు.
ఈ నేపథ్యంలో వందేమాతరం గేయంపై చర్చకు ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే.. దీనికి ప్రతిపక్షాలు విముఖత వ్యక్తం చేశాయి. అయినప్పటికీ.. దీనిపైచర్చించిన తర్వాతే సర్‌పై చర్చకు ప్రాధాన్యం ఉంటుందని కేంద్రం తేల్చి చెప్పింది. ఈనేపథ్యంలో ఈ నెల 8న(సోమవారం) వందేమాతరంపై చర్చ చేపట్టనున్నారు. రోజు రోజంతా కూడా దీనిపై చర్చిస్తారు. అంటే.. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సర్ కంటే కూడా ముందే.. వందేమాతరంపై పార్లమెంటులో చర్చ చేపట్టడం ద్వారా.. మోడీ పైచేయి సాధించారు. ఇక, ఈ చర్చలో ఏం జరుగుతుందన్నది ముందుగానే తెలుస్తోంది. కాంగ్రెస్ గత పాలనను, పాలకులకు ఎండగట్టడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.