తెలంగాణకు సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల కోనసీమజిల్లాలో పర్యటించినప్పుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణలో దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటివారు..పవన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలను కూడా తప్పుబట్టారు. పవన్ తెలిసీ తెలియని రాజకీయాలు చేస్తున్నారంటూ.. మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు.
ఈ నేపథ్యంలో తాజాగా జనసేన కార్యాలయం ఓ లేఖను విడుదల చేసింది. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించవద్దని కోరింది. కొందరు తెలంగాణ నాయకులు ఈ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని.. అలా చేయొద్దని పేర్కొంది. రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని..ఇరు రాష్ట్రాల మధ్య సుహీద్భావ వాతావరణం ఉండాలని పవన్ కల్యాణ్ కోరుకుంటున్నారని ఈ లేఖలో పార్టీ పేర్కొంది. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో పర్యటించిన సమయంలో రైతులతో ముచ్చటిస్తూ చెప్పిన మాటలను వక్రీకరించడం తగదని తెలిపింది.
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చక్కని వాతావరణం నెలకొందని.. ఈ సమయంలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తున్నారని.. అలా చేయొద్దని కోరింది. అయితే.. దీనిపై ఇప్పటికే క్షమాపణలు కోరిన మంత్రులు కోమటిరెడ్డి, వాటికి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్, ఎమ్మెల్సీలు బల్మూరి, అద్దంకిలు శాంతి స్తారో లేదో చూడాలి.
ఇంతకీ పవన్ ఏమన్నారు?
ఇటీవల కోనసీమ జిల్లాలో పర్యటించిన పవన్ కల్యాణ్.. ఇక్కడి కొబ్బరి రైతులతో మమేకమయ్యారు. వారి కష్టాలు తెలుసుకున్నారు. కొబ్బరి తోటల్లో కలియదిరిగారు. అనంతరం వారితో భేటీ అయి.. సమస్యలు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే గోదావరి జిల్లాలకు అన్నపూర్ణ అనే పేరుంది. పచ్చగా కళకళలాడుతూ ఉంటాయి. అయితే.. రాష్ట్ర విభజనకు ఈ పచ్చదనంకూడా కారణమే. కోనసీమ కూడా రాష్ట్ర విభజనకు కారణం. ఇక్కడి కొబ్బరి చెట్లు నిటారుగా ఉండేవి. కానీ.. దిష్టితగిలి ఇప్పుడు మొండాలుమాత్రమే మిగిలాయి.. అన్నారు. ఈ వ్యాఖ్యలే దుమారం రేపాయి.