మంత్రి నారా లోకేష్ తాజాగా మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. దీంతో ఇప్పటివరకు ఆయన 8 సార్లు ఢిల్లీలో పర్యటించినట్టు అయింది. ఈ పర్యటనలో మరోసారి రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడులు, రాష్ట్రానికి సంబంధించి కేంద్ర నుంచి రావాల్సిన నిధులు ఇతర సంక్షేమ పథకాలు వంటి కీలక అంశాలు ఉన్నాయన్నది మంత్రి కార్యాలయం చెబుతున్న కీలక విషయం. అంతేకాదు ఈ పర్యటన ద్వారా త్వరలో ప్రారంభించనున్న క్వాంటం వ్యాలీ సిటీకి సంబంధించి కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకురావడం అదేవిధంగా కేంద్ర మంత్రులతో చర్చించి వారిని ఆహ్వానించే అంశాలు కూడా ఉన్నట్టు తెలిసింది.
ప్రధానంగా పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా నారా లోకేష్ ఇప్పటికీ మూడోసారి పర్యటించినట్టు అయింది. గతంలో రెండు సార్లు కూడా ఆయన పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలోనే పర్యటించారు. ఆ సమయంలో అయితే ఎక్కువ మంది ప్రజాప్రతినిధుల్లో ముఖ్యంగా వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంపీలను కలుసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంతేకాదు వారితో సంభాషించేందుకు రాష్ట్రానికి సంబంధించిన అంశాలను చర్చించేందుకు కూడా లోకేష్ కు అవకాశం చిక్కుతుంది.
ఈ నేపథ్యంలోనే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న ప్రతిసారి గత మూడు దఫాలుగా నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఇది ఒక మంచి పరిణామం. సాధారణంగా ఏదైనా పార్టీ ఒక నాయకుని పెట్టుకుని అతనిపై ఆధారపడి కార్యక్రమాలను చేపట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ, చంద్రబాబు ఒకవైపు అట్లా చేస్తూనే మరోవైపు మంత్రి నారా లోకేష్‌ను ఢిల్లీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించేలా చేస్తుండడం భవిష్యత్తు రాజకీయాల్లో నారా లోకేష్ పాత్రను మరింత పెంచుతున్నారన్న సందేశాన్ని ఇస్తున్నట్లు అయింది.
అయితే మొత్తానికి ఢిల్లీ పర్యటనలో లోకేష్ ఇది ఎనిమిదో సారి కావడం రాష్ట్రంలో పెట్టుబడులు అదేవిధంగా పరిశ్రమలు తీసుకు వస్తున్న క్రమంలో పర్యటనకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ఈ పర్యటనలో కేంద్ర మంత్రులను ఆయన కలుసుకుంటారు. వారితో ముచ్చటిస్తారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు సహా కేంద్రం నుంచి తీసుకురావాల్సిన నిధులపై కూడా వారితో చర్చించి సాధ్యమైనంత వేగంగా ఆ నిధులు తీసుకొచ్చేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో సక్సెస్ అయితే రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో ఆయన పుంజుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.