ఏపీలో కూటమి గెలుపు చూసి వైసీపీకి కన్నుకుట్టిన సంగతి తెలిసిందే. అందుకే ఏ మాత్రం చిన్న అవకాశం దొరికినా కూటమిని విచ్ఛిన్నం చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కూటమి పార్టీల నేతలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక సలహానిచ్చారు. కూటమిలోని మూడు పార్టీల నాయకుల ఐక్యతే రాష్ట్ర ప్రగతికి మూలమని ఆయన అన్నారు. కానీ, కూటమి బలంగా ఉండాలంటే మూడు పార్టీలు ఓ మినీ యుద్ధం చేయాల్సి ఉంటుందని పవన్ అన్నారు.
మూడు పార్టీలలోని నేతల మధ్య చిన్న చిన్న అవగాహనా లోపాలుంటే కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. వర్షించని మేఘం, శ్రమించని మేధావి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటేనని అన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజాబలం ఉండి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవస్థల్లో మార్పులు తేలేకపోతే ఈ పదవులన్నీ నిష్ప్రయోజనమేనని పవన్ అన్నారు.
కూటమిలోని మూడు పార్టీలకు విభిన్న భావజాలాలున్నాయని, ఒక పార్టీలోని నాయకులకే చిన్న చిన్న విభేదాలుండడం సహజమని చెప్పారు. రాష్ట్రం బాగుండాలని, అరాచకాలు ఉండకూడదనే ఉమ్మడి లక్ష్యంతో కూటమి ఏర్పడిందని, ఏవైనా సమస్యులంటే కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారమవుతాయని చెప్పారు. అందుకోసం మినీ యుద్ధాలు చేయాలని, యుద్ధం అంటే మాట్లాడుకుంటే సరిపోతుందని చెప్పారు.