కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ఒక ఉత్తర్వు రచ్చ రచ్చగా మారటమే కాదు.. మొండికి మారుపేరుగా ఉండే మోడీ సర్కారు సైతం వెనక్కి తగ్గిన పరిస్థితి. గడిచిన వారం రోజులుగా కేంద్రం తీసుకొచ్చిన ‘సంచార్ సాథీ’ మొబైల్ యాప్ సంచలనంగా.. అంతుకు మించిన వివాదంగా మారిన సంగతి తెలిసిందే. సైబర్ మోసాలపై కంప్లైంట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ సంచార్ సాథీ.
అయితే.. ఈ యాప్ ను వినియోగదారు ఇష్టంతో కాకుండా కచ్ఛితంగా ప్రతి మొబైల్ లో ఉండాలని కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఉండటమే అసలు వివాదానికి కారణంగా చెప్పాలి. మొబైల్ వినియోగదారుల భద్రత.. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకే తామీ యాప్ తీసుకొచ్చినట్లుగా కేంద్రం చెబుతోంది. ఇందులో అధునాతన ఫీచర్లు ఉన్నాయని.. దీన్ని అందరూ వినియోగించుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. ఈ యాప్ ను మొబైల్ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకున్న తర్వాత ఫోన్ నంబరు సెంట్రల్ డేటా బేస్ లో అనుసంధానం అవుతుంది. చట్టబద్ధంగా తీసుకున్న ప్రతి మొబైల్ వివరాలు రికార్డు అవుతాయి.
సదరు ఫోన్ పోయినా.. దొంగతనానికి గురైనా ఈ యాప్ ద్వారా బ్లాక్ చేసుకోవచ్చు. సంబంధిత మొబైల్ ఎక్కడా పని చేయకుండా అన్ని నెట్ వర్కులను అలర్టు చేస్తుంది. దీంతో సిమ్ కార్డు మార్చినా ఫలితం ఉండదు. ఆ ఫోన్ పని చేయదు. అంతేకాదు.. అనుమానిత కాల్స్.. మెసేజ్ లు వచ్చినప్పుడు కాల్ లాగ్ నుంచే నేరుగా కంప్లైంట్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు తమ మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లు ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకోవచ్చు.
అంతేకాదు.. ఎవరైనా తమ పేరు మీద అనధికారికంగా నంబరు ఉంటే ఫిర్యాదు చేసే వీలుంది. మొబైల్ చోరీకి గురైనా.. పొరపాటున పారేసుకున్నా.. బ్లాక్ చేసుకునే సదుపాయం ఉంది. సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనే సమయంలో దాని ప్రామాణికతను ఈ యాప్ ద్వారా గుర్తించే వీలుంది. ఈ ఏడాది జనవరిలో సంచార్ సౌథీ యాప్ ను కేంద్రం విడుదల చేసినా.. దాన్నికచ్ఛితంగా అన్ని మొబైళ్లలో ఉండాలన్న ఉత్తర్వు వెలుగు చూసినప్పటి నుంచి ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి.
ప్రస్తుతం ఆండ్రాయిడ్.. ఐవోఎస్ ప్లాట్ ఫాం లలో అందుబాటులో ఉంది. హిందీతో పాటు 21 ప్రాంతీయ భాషల్లో ఉంది. ఈ యాప్ ను అన్ని మొబైల్ ఫోన్ తయారీ సంస్థలకు.. డిఫాల్ట్ యాప్ గా ఉండేలా తయారు చేయాలని పేర్కొంటూ కేంద్రం ఇటీవల ఆదేశాలు జారీ చేయటం వివాదంగా మారింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు లేవనెత్తిన అభ్యంతరాల్ని చూస్తే..
- ఈ యాప్ తప్పనిసరి చేయటం ద్వారా కేంద్రం తన నిఘా యాప్ ను మొబైల్ లో ఉండేలా చేసింది. పర్మినెంట్ నిఘా బ్యాక్ డోర్ గా పేర్కొన్నారు.
- ఈ యాప్ ద్వారా ప్రభుత్వం పైరుల వ్యక్తిగత కమ్యూనికేషన్.. డేటా మీద నిఘా పెట్టేస్తారన్న ఆందోళన
- యాప్ కాల్ లాగ్ లు.. ఎస్ఎంఎస్ లు.. కెమెరా.. ఫోటోలు.. లోకేషన్ లాంటి వాటి పర్మిషన్ కోరుతుంది. ఇది వినియోగదారుడి ప్రైవసీకి భంగం కలిగించే వీలుందన్న విమర్శ.
- మొబైల్ వినియోగదారుల ఇష్టంతో సంబంధం లేకుండా ప్రతి మొబైల్ లోనూ తప్పనిసరిగా ఇన్ స్టాల్ చేసుకోవాలన్న నిబంధన.. వినియోగదారుల స్వేచ్ఛను అడ్డుకుంటుంది.
- యాప్ ను డిలీట్ చేసే అవకాశం లేకపోవటం.
- యాప్ ఎలా పని చేస్తుంది? దాని సెక్యూరిటీకి సంబంధించి ఎలాంటి టెక్నికల్ డాక్యుమెంట్ లేకపోవటం.
- యాప్ లో నో యువర్ కనెక్షన్స్ ఫీచర్ తరచుగా తప్పు సమాచారాన్ని చూపే ఫీచర్ లో లోపాలు ఉన్నట్లుగా ఫిర్యాదులు.
- గుప్పెడు మంది నేరస్తుల్ని పట్టుకోవటానికి కోట్లాది మందిని నిఘా నీడలోకి తీసుకెళ్లటం ఎంతవరకు సబబు?
- ఉత్పత్తిదారులకు తప్పనిసరిగా ఇన్ స్టాల్ చేసి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చి.. ఇష్టపడకపోతే వినియోగదారులు తొలగించుకోవచ్చంటూ సంబంధం లేని మాటలు చెప్పటం
ఇలా పలు ఫిర్యాదులు.. విమర్శలతో పాటు.. పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం కావటంతో కేంద్రం తాజాగా వెనక్కి తగ్గింది. మొబైల్ ఫోన్ తయారీదారులకు తాము జారీ చేసిన ఆదేశాల్ని వెనక్కి తీసుకుంది. ఈ విషయాన్ని టెలికం శాఖ వెల్లడించింది. ఈ యాప్ ఇన్ స్టాల్ చేసుకుంటున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతోందని.. అందుకే గతంలో జారీ చేసిన ఆదేశాల్ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించింది.
పెద్దగా అవగాహన లేని ప్రజలకు కూడా ఈ యాప్ ను చేరువ చేయాలన్న ఉద్దేశంతోనే తప్పనిసరి ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు అయితే.. మంగళవారం ఒక్కరోజే ఆరు లక్షల మంది సంచార్ సాథీ యాప్ నను డౌన్ లోడ్ చేసుకున్నారని.. డౌన్ లోడ్లు వేగంగా పెరుగుతున్నప్పుడు తప్పనిసరి ప్రీఇన్ స్టాల్ చేయాలన్న ఆదేశాల్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొంది.
ఈ యాప్ తో 41 లక్షల మోసపూరిత మొబైల్ నంబర్లను గుర్తించి నిరోధించామని.. దొంగలించిన దాదాపు 26 లక్షల మొబైల్ సెట్ల జాడను కనిపెట్టి.. ఏడు లక్షల సెట్లను వాటి యజమానులకు అందించినట్లుగా టెలికం శాఖ పేర్కొంది. ఇప్పటివరకు కోటిన్నర మంది ఇన్ స్టాల్ చేసుకున్నట్లుగా టెలికం శాఖ ప్రకటించింది. తన తాజా నిర్ణయంతో ఒక వివాదాన్ని మొగ్గలోనే తుంచేలా కేంద్రం జాగ్రత్త పడిందని చెప్పాలి.