వైసీపీ పుంజుకోవాలని.. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావాలని.. ఆ పార్టీనాయకులు కోరుకోవడం తప్పుకాదు. కానీ, కొన్ని కొన్ని విషయాలు మాత్రం.. ఆ పార్టీని నీడలా వెంటాడుతున్నాయి. ఆయా విషయా ల్లో సదరు పార్టీ మార్పు దిశగా అడుగులు వేస్తే తప్ప.. పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదు. వీటిలో ప్రధానంగా 4 విషయాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాలే.. ఇప్పటికీ ఓ వర్గం ప్రజలకు-వైసీపీకి మధ్య గ్యాప్‌ను పెంచాయి.. అదే గ్యాప్‌ను కొనసాగిస్తున్నాయి.
1) నియంతృత్వం: ఇది వాస్తవమా.. కాదా.. అనేది పక్కన పెడితే.. ప్రజల్లో మాత్రం విస్తృతంగా ప్రచారం లోకి వచ్చింది. జగన్ ఎవరి మాటా వినరని.. ఆయనను గెలిపిస్తే.. మళ్లీ నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తారని పెద్ద ఎత్తున ప్రజలు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదేసమయంలో గతం తాలూకు అనుభవాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో జగన్ వ్యవహారం.. ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. ఈ విషయంలో ప్రజలను ఆయన తనదిశగా మలుచుకోవాలి.
2) పరదాల సీఎం: పరదాల సీఎంగా పెద్ద ఎత్తున బ్యాడ్ నేమ్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ క్ర మంలో జగన్.. తనను తాను నిరూపించుకునేందుకు ప్రయత్నం చేయాలి. అదేవిధంగా చెట్లు నరికించ డం.. సభలకు వచ్చిన వారిని వేధించడం.. ఇలాంటి విషయాల ద్వారా జగన్ పలుచనయ్యారన్నది వాస్తవం. అందుకే.. ఇప్పటికీ నాటి సంగతలు.. నీడల్లా వెంటాడుతున్నాయి.
3) మూడు రాజధానులు: ఇప్పటికీ దీనిపైనే వైసీపీ స్టాండ్ ఉందా? అంటే సమాధానం ఔననే వస్తోంది. కానీ.. ప్రజలు మాత్రం అమరావతిని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మూడు రాజధానులను పట్టుకుని విఫలమైన జగన్.. చుట్టూ.. ఇంకా అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికీ ఆయన అమరావతిని రాజధానిగా ఒప్పుకోకపోవడం.. ప్రజల్లో చర్చకు వస్తోంది. క్రీనీడలా వెంటాడుతోంది.
4) గంజాయి: ఇది వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున చర్చకు వచ్చిన విషయం. పైగా రాష్ట్రంలో కలవర పెట్టిన వ్యవహారం కూడా. దీనిపైనా అప్పట్లో జగన్ మౌనంగానే ఉన్నారు. మరోసారి వైసీపీ వస్తే.. గంజాయి సాగు యాదృచ్ఛికంగా మారుతుందన్న చర్చ కూడా ఉంది. ఈ నేపథ్యంలో వీటిని తుడుచుకునేందుకు.. లేదా ప్రజల మైండ్ సెట్ మార్చేందుకు వైసీపీ ప్రయత్నించాల్సి ఉంది. కానీ.. అలా చేయనంత కాలం ఇవి క్రీనీడల్లా వెంటాడుతూనే ఉంటాయి.