దేశంలో అతి పెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో గత నాలుగు రోజులుగా సర్వీసులను భారీగా రద్దు చేయడంతో, సాధారణ ప్రయాణీకులు మాత్రమే కాదు… సినీ రంగం కూడా ఢీలా పడింది. ఇండిగో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడం టాలీవుడ్ ను గట్టిగా ప్రభావితం చేస్తుంది. వందలాది విమానాలను సంస్థ రద్దు చేయడంతో షూటింగ్ షెడ్యూల్స్ పూర్తిగా తారుమారైన పరిస్థితి నెలకొంది. పలు నగరాల్లో జరిగే షూటింగ్‌ల కోసం నటులు, టెక్నీషియన్లు ముందుగానే ప్లాన్ చేసుకున్న ప్రయాణాలు ఒక్కసారిగా ఆగిపోవడంతో చిత్ర యూనిట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
ముఖ్యంగా ముంబై, చెన్నై, కేరళ, ఢిల్లీ లాంటి నగరాల నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన ప్రముఖ నటులు ఇండిగో విమానాల రద్దు వల్ల స్టక్ అయ్యారు. వందల కోట్ల బడ్జెట్‌పై నడుస్తున్న రెండు భారీ పాన్-ఇండియా సినిమాల్లో కీలక కాంబినేషన్ సీన్స్ చిత్రీకరణకు ప్లాన్ చేసిన డేట్స్‌లో ప్రధాన ఆర్టిస్టులు హాజరు కాలేకపోవడంతో యూనిట్లు షూటింగ్‌ను నిలిపేయాల్సి వచ్చిందన్న సమాచారం ప్రస్తుతం ఫిలిం నగర్ చుట్టూ హాట్ టాపిక్‌గా మారింది. ఒక్క రోజుకే కోట్లలో ఖర్చు అయ్యే ఈ ప్రొడక్షన్‌లలో జరిగిన ఈ డిలే నిర్మాతలపై భారీ ఆర్థిక భారం పెంచుతోంది.
హైదరాబాద్‌లోని ప్రముఖ స్టూడియోలలో సెట్‌లు రెడీగా ఉన్నా… నటులు లేనందున యూనిట్లకు ఏ పని జరగడం లేదు. దీంతో స్టూడియో ఖర్చులు, టెక్నీషియన్ డైరీలు, లొకేషన్ పర్మిట్‌లన్నీ వృథా అయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కాంబినేషన్ డేట్స్ మార్చడం చాలా కష్టం అవడంతో, ఒక స్టార్ డిలే అయితే… మొత్తం షెడ్యూల్ డిలే అనే పరిస్థితి వచ్చింది.
ఇండిగోలో కొనసాగుతున్న సాంకేతిక మరియు సిబ్బంది సమస్యలు పూర్తిగా సద్దుమణగడానికి మరో 48 గంటలు పట్టే అవకాశం ఉందని విమానయాన రంగ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఈ గందరగోళం ఇంకా రెండు రోజులు కొనసాగే అవకాశం ఉంది. దీంతో టాలీవుడ్ యూనిట్లు మరింత అప్రమత్తంగా ప్లానింగ్ మార్చుకుంటున్నాయి.