ధీరూభాయ్ అంబానీ వారసుల్లో ఒకరు జగజ్జేతగా విలసిల్లుతున్నారు. ప్రపంచ కుబేరుడిగా.. ముఖేష్ అంబానీ ఉన్నారు. పైగా వ్యాపారాలను దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నారు. కానీ, ఇదేసమయంలో ధీరూ రెండో కుమారుడు అనిల్ అంబానీ.. మరిన్ని కష్టాల్లో కూరుకుపోతున్నారు. తాజాగా 1120 కోట్ల రూపాయల విలువై న ఆస్తులను ఎన్ ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్ అదికారులు అటాచ్ చేశారు. వాస్తవానికి ఇప్పటికే 18 అత్యంత విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేయడం గమనార్హం.
దీంతో అనిల్ అంబానీ పరిస్థితి దారుణంగా తయారైంది. దీనికి కారణం ఏంటి? ఎందుకు? అనేది వాణిజ్య వర్గాల్లోనే కాదు.. రాజకీయ వర్గాల్లోనూ చర్చగా మారింది. ఆది నుంచి కూడా ధీరూ భాయ్ అంబానీ రాజకీ యాలకు అతీతంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. అయితే.. ఆయన తరం తర్వాత.. బాధ్యతలు చేపట్టిన కుమారులు ఆస్తులు పంచుకున్నారు. ఈ క్రమంలోనే తేడాలు వచ్చి.. ముఖేష్-అనిల్ అంబానీలు విడిపోయారు.
యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు.. అనిల్ అంబానీ వ్యాపారాలు భారీగా పుంజుకున్నాయి. ఆ సమయంలో ముఖేష్ అంబానీ వ్యాపారాలు నామమాత్రంగా సాగాయి. రిలయెన్స్ ఔట్‌లెట్లకు.. అప్పట్లో అనిల్ అంబానీకి కాంగ్రెస్ పార్టీ అనుమతి ఇచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా ఔట్‌లెట్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా టెలికం రంగంలోనూ.. అనిల్ అంబానీ దూకుడుగా ముందుకు సాగారు. ఇక, ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారన్నది రాజకీయ వర్గాల్లో ఉన్న చర్చ.
ఇదేసమయంలో ముఖేష్ అంబానీ.. బీజేపీకి దన్నుగా నిలిచారు. అప్పట్లో గుజరాత్‌ముఖ్యమంత్రిగా ఉన్న మోడీకి ఆయన బలమైన మద్దతుదారుగా నిలిచిన వ్యాపార వేత్త. ఇక, 2014లో కేంద్రంలో మోడీ సర్కారు ఏర్పడడంలోనూ ముఖేష్ పాత్ర ఉందని అంటారు. ఇలా.. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ముఖేష్ వ్యాపారాలు విస్తరించడమే కాదు.. పుట్టగొడుగుల్లా పెరిగిపోయాయి కూడా. ఇక, అనిల్ అంబానీ వ్యాపారాలు నేల చూపులు చూడడం ప్రారంభించాయి. ఫలితంగా ఇప్పుడు `ఎస్` బ్యాంకు కుంభకోణం.. రుణాల ఎగవేత కేసులు చుట్టుకుని అనిల్ పరిస్థితి నానాటికీ దిగజారుతోందని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి.