వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మరోసారి రాజకీయంగా కుదిపేసే పరిణామాలు నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే అనేక కీలక నాయకులు పార్టీ నుంచి దూరమవుతుండగా.. ఇప్పుడు ఆ జాబితాలో మేకపాటి రాజమోహన్ రెడ్డి పేరు వినిపించడం పెద్ద సంచలనాన్ని రేకెత్తిస్తోంది. కొద్ది రోజుల కిందట మేకపాటి రాజమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీ అంతర్గత పరిస్థితులపై నేరుగానే వేలెత్తి చూపించాయి.
“జగన్‌కు వాస్తవాలు చెప్పడం లేదు… చుట్టూ కోటరీ ఉంది” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పుడే పార్టీ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. అయితే ఆశ్చర్యకరంగా ఆ వ్యాఖ్యలపై జగన్ కనీస స్పందన కూడా చూపలేదని తెలుస్తోంది. ఇది మేకపాటికి మరింత నిరాశ కలిగించినట్లు తెలుస్తోంది. జగన్ వైఖరి తెలుసుకున్నాక పార్టీలో ఉండడం అంత శ్రేయస్కరం కాదని రాజమోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీని వీడే దిశగా ఆయన తన అనుచరులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం అందుతోంది.

మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డికి సమకాలీకుడు. రాష్ట్ర రాజకీయాల్లో మేకపాటి కుటుంబం మంచి పునాది కలిగి ఉంది. రాజమోహన్ రెడ్డి ఎన్నో సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా సేవలందించారు. జగన్ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ఒంటరి పోరులో అండగా నిలిచిన ప్రముఖ నాయకుల్లో ఆయన ఒకరు. అలాగే ఆయన కుమారుడు గౌతమ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో జగన్ తన క్యాబినెట్ లో చోటు కల్పించారు. ఆయన అకాల మరణంతో మరో కుమారుడు విక్రమ్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఇవన్నీ వైఎస్ఆర్సీపీతో మేకపాటి ఫ్యామిలీకి బలమైన బంధాన్ని ఏర్పరచాయి. కానీ తాజాగా ఆ బంధం సడలిపోయిన సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి.
ఇప్పటికే కుటుంబ సభ్యులు, సీనియర్ నేతలు, జిల్లాల వారీగా కీలక నాయకులు ఒక్కరొక్కరుగా జగన్‌ను వదిలిపెడుతున్నారు. ఇక ఇప్పుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా పార్టీకి గుడ్ బై చెప్పనున్నారని విసృతంగా ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే జగన్‌కు ఇది భారీ షాక్ అవుతుందని, పార్టీకి రాజకీయ నష్టంగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.