దర్శకుడు అవ్వాాలని కలలు కని.. ఎన్నో ఏళ్ల కష్టం తర్వాత ఆ కల నెరవేరితే.. తొలి చిత్రాన్ని థియేటర్లలో చూసుకునే అవకాశం రాకపోతే ఆ దర్శకుడికి ఎంత ఆవేదన కలుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘కలర్ ఫొటో’తో ఈ అనుభవమే ఎదురైంది సందీప్ రాజ్‌కు. కరోనా టైంలో విడుదలకు సిద్ధమైన ఆ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేసే అవకాశం లేకపోవడంతో ఆహా ఓటీటీకి ఇచ్చారు. అక్కడా సినిమాకు చాలా మంచి స్పందన వచ్చింది. దర్శకుడిగా సందీప్ మంచి పేరే సంపాదించాడు.
కానీ థియేటర్లలో తన సినిమాను చూసుకోలేకపోయాననే బాధ మాత్రం ఉండిపోయింది. తొలి సినిమా విజయవంతమైనప్పటికీ.. ఇప్పటిదాకా సందీప్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా థియేటర్లలోకి రాలేదు. ఆకాశవాణి, గుడ్ లక్ సఖి, ముఖచిత్రం లాంటి చిత్రాలకు రచయితగా పని చేశాడు, ఆల్ ఇండియా రేడియో సిరీస్‌కు నిర్మాతగా వ్యవహరించాడు.. కొన్ని చిత్రాల్లో నటుడిగానూ కనిపించాడు కానీ.. దర్శకుడిగా తర్వాతి సినిమా తీయడంలో ఆలస్యం జరిగింది.
ఎట్టకేలకు ‘మోగ్లీ’ సినిమాతో థియేటర్ ప్రేక్షకులను పలకరించడానికి అతను రెడీ అయ్యాడు. 12న ఆ చిత్రం రిలీజ్ కావాల్సింది. కానీ ‘అఖండ-2’ అనూహ్య పరిణామాల మధ్య తర్వాతి వారానికి రావడంతో ‘మోగ్లీ’ని వాయిదా వేయక తప్పలేదు. దీంతో తీవ్ర వేదనతో సందీప్ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాడు. కలర్ ఫొటో, మోగ్లీ సినిమాలను వేరే దర్శకుడు తీసి ఉంటే బాగుండేదని.. ఈ చిత్రాల కోసం చాలామంది కష్టపడ్డారని చెప్పాడు.
కానీ, ఈ రెండు చిత్రాలకూ రిలీజ్ విషయంలో ఇబ్బందులు తప్పలేదని.. రెంటిలో కామన్‌గా ఉన్నది తానే కాబట్టి.. తానొక బ్యాడ్ లక్ అనే ఆలోచన వస్తోందని సందీప్ రాజ్ పేర్కొన్నాడు. వెండి తెర తనను ద్వేషిస్తోందేమోనని.. అందుకే థియేటర్లలో ‘డైరెక్టెడ్ బై సందీప్ రాజ్’ అనే మాటను చూసుకోలేకపోతున్నానని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. ‘మోగ్లీ’ కోసం ఎంతో కష్టపడ్డానని.. రోషన్, సరోజ్ సహా టీం అంతా దీని కోసం శ్రమించిందని.. వీళ్లందరి కోసం మోగ్లీ వీలైనంత త్వరగా విడుదలై మంచి ఫలితం అందుకోవాలని ఆశిస్తున్నట్లు అతను చెప్పాడు.