బీఆర్ఎస్ నేతలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్ ఎమ్మెల్యేలను బీ.టీ బ్యాచ్ అంటూ కవిత విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్టు చెప్పుకుంటున్న నేతలు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమవుతున్నారు కవిత ఆరోపించారు. అధికారం కోల్పోయిన తర్వాత విజయ్ దివస్, దీక్షా దివస్ అంటూ హడావిడి చేస్తున్నారని, తెలంగాణ ఉద్యమాల గడ్డ అని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని కవిత తాజాగా చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే కవితకు బీఆర్ఎస్ నేత, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు.
కవిత చరిత్ర హీనురాలని, మంత్రి పదవులు అమ్ముకున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. భూముల దోపిడీలు చేశారని, పార్టీలో కుట్రలు పన్నారని షాకింగ్ ఆరోపణలు చేశారు. కేసీఆర్ మర్యాద కోసం ఇన్నాళ్లూ ఊరుకుంటున్నానని, ఇక సహనంతో ఉండేది లేదని వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ ఎమ్మెల్యేలపై గౌరవం లేకుండా కవిత మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కోసం హైదరాబాద్ ఎమ్మెల్యేలు కలిసికట్టుగా నడుస్తున్నామని, నగరంలో ఉండే ఎమ్మెల్యేలు బీ.టీ బ్యాచ్ అని కవిత చెప్పడం దారుణమన్నారు. ఉద్యమంలో పనిచేయకపోయినా తామంతా తెలంగాణ కోసం పని చేశామని, తాము ఉద్యమం చేశామని ఏనాడూ చెప్పుకోలేదని అన్నారు.
తెలంగాణ చరిత్రను లిక్కర్ స్కాం పేరుతో కవిత నాశనం చేశారని, ఇంట్లో కుక్క పేరు విస్కీ అని కవిత పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. తాను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, తన స్థాయి కవితకు లేదని విమర్శించారు. కవిత వంటి కుక్కలు చాలా వచ్చి మొరిగిపోయాయని దూషించారు. బాలానగర్‌లో కవిత భర్తకు సంబంధించిన కబ్జాల చిట్టా ఉందని, ఓవర్‌ల్యాప్ ల్యాండ్‌ను పార్టీ పేరు చెప్పుకొని క్లియర్ చేసుకున్నారని ఆరోపించారు. పార్టీ పేరుతో 36 ఎకరాల భూమిని దోచుకున్నారని కూడా చెప్పారు. కేటీఆర్ పై కుట్రలు చేస్తోందని, హరీష్ రావును పార్టీ నుంచి వెళ్లగొట్టాలని చూస్తోంది కవితేనని సంచలన ఆరోపణలు చేశారు.